శ్రీకాళహస్తి సీఐ అంజూ యాదవ్ పై మహిళా కమిషన్ సీరియస్... ఎందుకంటే...!

  • ఓ మహిళపై దౌర్జన్యం చేస్తున్నట్టు వీడియో దృశ్యాలు
  • స్పందించిన మహిళా కమిషన్ సభ్యురాలు లక్ష్మి
  • సీఐపై చర్యలు తీసుకోవాలంటూ ఎస్పీని కోరిన వైనం
ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తి పట్టణ సీఐ అంజూ యాదవ్ పై మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. అంజూ యాదవ్... శ్రీకాళహస్తిలో ఓ హోటల్ యజమానురాలిని బలవంతంగా పోలీస్ జీప్ ఎక్కిస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. 

ఈ వీడియోపై టీడీపీ అధినేత చంద్రబాబు కూడా స్పందించారు. ఆరోగ్య సమస్యలు ఉన్న ఒక మహిళ పట్ల శ్రీకాళహస్తి వన్ టౌన్ సర్కిల్ ఇన్ స్పెక్టర్ దురుసు ప్రవర్తన దారుణ అని పేర్కొన్నారు. 

కాగా, పట్టణంలో పదకొండున్నర గంటల వరకు హోటల్ నిర్వహించకునే వెసులు బాటు ఉందని, కానీ సీఐ అంజూ యాదవ్ 10 గంటలకే వచ్చి దాడి చేశారని ఆ హోటల్ యజమానురాలి కుటుంబ సభ్యులు ఆరోపించారు. గంజాయి కేసులు పెడతామని బెదిరించారని వాపోయారు. అసలు తమ హోటల్ ఆ సీఐ పరిధిలో లేదని, అయినా గానీ ఆమె వచ్చి దాడి చేశారని వెల్లడించారు. 

ఈ ఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నట్టు రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు లక్ష్మి వెల్లడించారు. సీఐ అంజూ యాదవ్ పై చర్యలు తీసుకోవాలంటూ తిరుపతి జిల్లా ఎస్పీకి స్పష్టం చేశారు. మహిళా సీఐ గతంలోనూ ఇలాంటి ఘటనలకు పాల్పడినట్టు తెలిసిందని అన్నారు. సీఐ ప్రవర్తన రాష్ట్రానికి చెడ్డపేరు తెచ్చేలా ఉందని, పోలీసు వ్యవస్థకే సిగ్గుచేటని లక్ష్మి పేర్కొన్నారు. ఓ మహిళ అని కూడా చూడకుండా హోటల్ నిర్వాహకురాలిపై సీఐ దాడి చేయడం సభ్య సమాజం తలదించుకునేలా ఉందన్నారు.


More Telugu News