కండలు పెరిగేందుకు ఇంజెక్షన్లు తీసుకుంటున్నారా... అయితే ఇది చదవండి!

  • జిమ్ కు వెళ్లేవారికి అధికారుల హెచ్చరిక
  • మెఫెంటెర్మైన్ ఇంజెక్షన్లు అతిగా వాడొద్దని స్పష్టీకరణ
  • గుండెపోటుతో ప్రాణాలు కోల్పోతారని వెల్లడి
  • పుణేలో 246 అక్రమ ఇంజెక్షన్ల స్వాధీనం
నేటి యువకుల్లో కండలు పెంచి దృఢంగా కనిపించాలన్న కోరిక చాలామందిలో ఉంటుంది. అందుకే జిమ్ కు వెళ్లి భారీ కసరత్తులు చేస్తుంటారు. కొందరు త్వరగా కండలు పెరిగేందుకు మెఫెంటెర్మైన్ సల్ఫేట్ ఇంజెక్షన్లు కూడా తీసుకుంటారు. అయితే, ఈ ఇంజెక్షన్లు అతిగా వాడితే ప్రాణాలకు ముప్పు తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

మెఫెంటెర్మైన్ ఇంజెక్షన్లు యాంటీ హైపోటెన్సివ్స్ కేటగిరీలోకి వస్తాయి. లో బీపీ (హైపోటెన్షన్) ఉన్నవారికి చికిత్సలో భాగంగా వీటిని వినియోగిస్తారు. అంతేకాదు, శస్త్రచికిత్స సమయాల్లో రోగి హృదయ స్పందనను సాధారణ స్థితికి తీసుకువచ్చేందుకు కూడా ఈ ఇంజెక్షన్లను ఉపయోగిస్తారు. 

కానీ వీటిని బాడీబిల్డర్లు మరింత స్టామినా కోసం, కండరాల పెరుగుదల కోసం ఉపయోగిస్తున్నట్టు వెల్లడైంది. ఈ ఇంజెక్షన్లను సుదీర్ఘకాలం వాడడం వల్ల హైబీపీ, చర్మంపై దద్దుర్లు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, బలహీనత, మగత, నిద్రలేమి, వికారం, వాంతులు, కొన్నిసార్లు గుండెపోటుతో మరణాలు కూడా సంభవిస్తాయని నిపుణులు చెబుతున్నారు. మోతాదుకు మించితే ఈ ఇంజెక్షన్ హృదయ స్పందనను దెబ్బతీస్తుందని వివరించారు. 

పుణేలో ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు పలు చోట్ల దాడులు చేసి 246 ఇంజెక్షన్ వయల్స్ ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఇంజెక్షన్ ధర రూ.299 కాగా, కొందరు వ్యక్తులు జిమ్ ఔత్సాహికుల కోసం వీటిని ఒక్కొక్కటి రూ.1000 చొప్పున విక్రయిస్తున్నట్టు అధికారులు గుర్తించారు.

వీటిని డాక్టర్ ప్రిస్క్రిప్షన్ పైనే విక్రయించాల్సి ఉంటుందని, మెడికల్ ప్రాక్టీషనర్లతోనే ఈ ఇంజెక్షన్ చేయించుకోవాల్సి ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.


More Telugu News