తిరుమలలో నేడు గరుడ వాహన సేవ... విస్తృత ఏర్పాట్లు చేసిన టీటీడీ

  • కొనసాగుతున్న శ్రీవారి బ్రహ్మోత్సవాలు
  • నేటి రాత్రి 7 గంటల నుంచి గరుడ వాహన సేవ
  • 3 లక్షల మందిని తరలించేందుకు టీటీడీ సన్నద్ధం
  • తిరుమల కొండపై ఏడు చోట్ల హెల్ప్ డెస్కులు
  • ప్రత్యేకంగా టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు
తిరుమల బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు గరుడవాహన సేవ జరగనుంది. రాత్రి 7 గంటల నుంచి అర్ధరాత్రి 1 గంట వరకు ఈ గరుడోత్సవం నిర్వహించనున్నారు. అందుకోసం తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) విస్తృత ఏర్పాట్లు చేసింది. 

3 లక్షల మందిని తరలించేందుకు భారీ ఏర్పాట్లు చేసింది. ఆర్టీసీ బస్సులతో 3 వేల ట్రిప్పులు నడుపుతోంది. అలిపిరి పాత చెక్ పోస్టు శ్రీవారి మెట్టు వద్ద ద్విచక్రవాహనాలకు పార్కింగ్ పాయింట్ గా నిర్దేశించారు. తిరుమల కొండపై ఏడు ప్రాంతాల్లో టీటీడీ హెల్ప్ డెస్క్ లు ఏర్పాటు చేశారు. 

తిరుమాడ వీధుల్లోని గ్యాలరీల్లోకి భక్తులు సులువుగా ప్రవేశించేందుకు, నిష్క్రమించేందుకు తగిన చర్యలు తీసుకున్నారు. అన్నప్రసాదాల భవనాల్లో ఉదయం 8 గంటల నుంచి అర్ధరాత్రి 1.30 గంటల వరకు నిరంతరాయంగా అన్నప్రసాదాల వితరణ చేయనున్నారు. ఫుడ్ కౌంటర్ల ద్వారా కూడా అన్నప్రసాదాలు అందించనున్నారు. 

తిరుమాడ వీధుల్లో 2 లక్షల మజ్జిగ ప్యాకెట్లు అందుబాటులో ఉంచనున్నారు. లడ్డూల కొరత లేకుండా బఫర్ స్టాక్ ను కూడా అందుబాటులోకి తెచ్చారు. పీఏసీ-4లో మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నెంబర్ 1800 425 1111 కు కాల్ చేయాలని టీటీడీ సూచించింది.


More Telugu News