నేత‌ల‌తో కాఫీలు తాగి, ఫొటోలు దిగితే.. ప్ర‌ధాని కాలేరంటూ నితీశ్ కుమార్‌పై పీకే సెటైర్‌

  • బీహార్‌లో పాల‌న గాడి త‌ప్పింద‌ంటూ ప్ర‌శాంత్ కిశోర్ విమ‌ర్శ‌
  • రాష్ట్రంలో నితీశ్‌ ఎవ్వ‌రి మాటా విన‌ర‌ని విమ‌ర్శ‌
  • ఆయ‌న‌కు చెప్పే ధైర్యం ఎవ్వ‌రికీ లేద‌ని వ్యాఖ్య‌
బీహార్ ముఖ్య‌మంత్రి నితీశ్ కుమార్‌పై ఆ రాష్ట్ర నాయ‌కుడు, ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిశోర్ ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ప్రధాన మంత్రి రేసులో నిల‌వాల‌ని ఆశిస్తున్న నితీశ్‌పై విమ‌ర్శ‌లు చేశారు. కొందరు నేతలతో కాఫీలు తాగడం, ఫొటోలు దిగడం చేసినంత మాత్రాన బ‌ల‌మైన ప్రతిపక్షాన్ని నిర్మించ‌లేర‌ని ఎద్దేవా చేశారు. ఈ విష‌యంలో ప్ర‌జ‌ల‌కు స్ప‌ష్ట‌మైన సందేశం ఇచ్చి, కార్య‌క్షేత్రంలోకి దూకాల‌న్నారు. బీజేపీని ఓడించగల ఊపును తీసుకురావ‌డానికి స‌రైన ప్ర‌చారం చేపట్టాలంటే విస్తృత యంత్రాంగం అవసరం అన్నారు. నితీశ్ పాల‌న‌లో బీహార్‌లో పాల‌న గాడి త‌ప్పింద‌న్నారు. నితీశ్ విన‌డం మానేశార‌ని, రాష్ట్రంలో ఆయ‌న ఎవ్వ‌రినీ లెక్క‌చేయ‌డం లేద‌ని విమ‌ర్శించారు.  

"నితీశ్ కుమార్ విద్యావంతుడు అయినప్పటికీ ఆయ‌న‌ పాలనలో బీహార్‌లో విద్యావ్యవస్థ పూర్తిగా కుప్పకూలింది. మాకు ప్రాథమిక పాఠశాలలు ఉండేవి, అవి ఇప్పుడు కూలిపోయాయి. గ‌తంలో ఒక్కో జిల్లాలో కనీసం రెండు, మూడు ప్రభుత్వ పాఠశాలల్లో సీట్ల కోసం భారీ పోటీ ఉండేది. కానీ, ఇప్పుడు ఆ ప‌రిస్థితి లేదు. నితీశ్ కుమార్‌కి విద్య అంటే ఒకటి, రెండు గదుల గులాబీ భవనాలు నిర్మించడం మాత్ర‌మే. ఉపాధ్యాయుల ఆందోళ‌న త‌ప్ప ఇత‌ర ఏ విష‌యాల‌ను ఆయ‌న ప‌ట్టించుకోవ‌డం లేదు. నితీశ్ ఇప్ప‌టికే వినడం మానేశారు. ఆయ‌న‌ ముందు మాట్లాడే ధైర్యం ఎవ్వ‌రికీ లేదు. ప్ర‌తి సాయంత్రం ఆయ‌న నిర్వ‌హించే సమావేశాలలో, ఎవరైనా ఏదైనా సూచించడానికి ధైర్యం చేయరు. వాళ్లు నితీశ్ కుమార్ మాటలను మాత్రమే వింటారు" అని ప్ర‌శాంత్ కిశోర్ ఓ ఆంగ్ల పత్రిక‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో పేర్కొన్నారు.


More Telugu News