‘పీఎఫ్ఐ’ హిట్‌లిస్టులో ఉన్న ఐదుగురు కేరళ ఆరెస్సెస్ నాయకులు.. అత్యున్నతస్థాయి భద్రత

  • ఉగ్రవాదులతో పీఎఫ్ఐకి సంబంధాలు
  • పీఎఫ్ఐ, దాని అనుబంధ సంస్థలను ఐదేళ్లపాటు నిషేధించిన కేంద్రం
  • నిఘా వర్గాల హెచ్చరికలతో కేరళ ఆరెస్సెస్ నేతలకు భద్రత
నిషేధిత రాడికల్ సంస్థ పాప్యులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) ‘హిట్‌లిస్ట్’లో ఉన్న కేరళకు చెందిన ఐదుగురు ఆరెస్సెస్ నాయకులకు ప్రభుత్వం అత్యున్నత స్థాయి భద్రత కల్పించింది. కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికలతో అప్రమత్తమైన ప్రభుత్వం వారికి ‘వై’ కేటగిరి భద్రత కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది. కేరళలోని ఐదుగురు ఆరెస్సెస్ నేతలకు పీఎఫ్ఐ నుంచి ముప్పు ఉందంటూ జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) కేంద్ర హోంమంత్రిత్వ శాఖను హెచ్చరించింది. 

ఎన్ఐఏ, ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) నివేదికలతో అప్రమత్తమైన కేంద్రం వారికి ‘వై’ కేటగిరీ భద్రత కల్పించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో పారామిలటరీ కమాండోలు వారికి భద్రత కల్పించనున్నారు. దేశవ్యాప్తంగా ఇటీవల పీఎఫ్ఐ కార్యాలయాలు, నాయకుల ఇళ్లపై జరిగిన ఎన్ఐఏ సోదాలు సంచలనం సృష్టించాయి. కేరళలోని ఆ సంస్థ సభ్యుడు మహ్మద్ బషీర్ ఇంట్లో జరిపిన సోదాల్లో ఐదుగురు ఆరెస్సెస్ నేతలను టార్గెట్ చేసిన విషయం బయటపడింది. మొత్తం 11 మంది సెక్యూరిటీ సిబ్బంది ఆరెస్సెస్ నాయకులకు షిఫ్ట్ పద్ధతిలో రక్షణ కల్పిస్తారు. కాగా, ఉగ్రవాదులతో సంబంధాల నేపథ్యంలో పీఎఫ్ఐ సహా దాని అనుబంధ సంస్థలను ఉపా చట్టం కింద కేంద్రం ఐదేళ్లపాటు నిషేధించింది.


More Telugu News