మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ చట్టపరిధిని బాలికలకూ విస్తరించిన సుప్రీంకోర్టు

  • 24 వారాల్లోపు దేశంలోని మహిళలందరూ అబార్షన్ చేయించుకోవచ్చని తీర్పు
  • అబార్షన్ కోసం వచ్చే బాలికల సమాచారాన్ని పోలీసులకు చెప్పాల్సిన పనిలేదన్న ధర్మాసనం
  • పోక్సో చట్టంలోని సెక్షన్ 19(1) నుంచి వైద్యులకు రక్షణ
అబార్షన్ కోసం తమ వద్దకు వచ్చే బాలిక వివరాలను పోలీసులకు చెప్పాల్సిన పనిలేదంటూ సుప్రీంకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. ఈ మేరకు పోక్సో చట్టంలోని సెక్షన్ నుంచి వైద్యులకు రక్షణ కల్పించింది. సుప్రీం ధర్మాసనం ఇచ్చిన ఈ తీర్పుపై సర్వత్ర హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. తాజా తీర్పు నేపథ్యంలో అవాంఛిత గర్భాన్ని తీయించుకునేందుకు బాలికలు ఇకపై కోర్టుల చుట్టూ తిరగాల్సిన బాధ తప్పుతుంది.

24 వారాల్లోపు దేశంలోని మహిళలందరూ సురక్షిత గర్భవిచ్ఛిత్తి చేసుకోవంటూ గురువారం కీలక తీర్పు వెల్లడించిన సుప్రీంకోర్టు.. బాలికల విషయంలోనూ ఈ తీర్పును విస్తరించింది. మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ (ఎంటీపీ) చట్టపరిధిని బాలికలకు విస్తరిస్తూ.. వారు కూడా 24 వారాల్లోపు అబార్షన్ చేసుకోవచ్చని తెలిపింది. ఈ విషయంలో వైద్యులకు కూడా రక్షణ కల్పించింది. బాలికల అబార్షన్‌కు అడ్డుగా ఉన్న పోక్సో చట్టంలోని సెక్షన్ 19(1) నుంచి వైద్యులకు రక్షణ కల్పిస్తూ కీలక తీర్పు వెలువరించింది.

బాలికలు ఎవరైనా అబార్షన్ కోసం తమను ఆశ్రయించినప్పుడు ఆ సమాచారాన్ని స్థానిక పోలీసులకు తెలియజేయాలని ఈ సెక్షన్ చెబుతుంది. లేదంటే దానిని నేరంగా పరిగణిస్తారు. ఈ నేపథ్యంలో గురువారం అబార్షన్ల విషయంలో చారిత్రాత్మక తీర్పు వెల్లడించిన జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం.. ఈ సెక్షన్ నుంచి వైద్యులకు మినహాయింపునిచ్చింది. అబార్షన్ కోసం తన వద్దకు వచ్చిన మైనర్ లేదంటే ఆమె సంరక్షుడి విజ్ఞప్తి మేరకు ఆ వివరాలను వైద్యులు గోప్యంగా ఉంచొచ్చని పేర్కొంది. అంతేకాదు, ఈ వివరాలను పోలీసులకు చెప్పాల్సిన పనికూడా లేదని సుప్రీంకోర్టు తీర్పులో పేర్కొంది.


More Telugu News