బరి నుంచి తప్పుకున్న దిగ్విజయ్ సింగ్.. మల్లికార్జున ఖర్గే - శశి థరూర్ ల మధ్యే పోటీ

  • ఉత్కంఠను రేపుతున్న కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక
  • ఖర్గేపై పోటీ చేయలేనన్న దిగ్విజయ్ సింగ్
  • ఇప్పటికే బరి నుంచి తప్పుకున్న అశోక్ గెహ్లాట్
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక పలు మలుపులు తిరుగుతూ ఉత్కంఠను రేకెత్తిస్తోంది. ఇప్పటికే రేసు నుంచి రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ తప్పుకోగా... తాజాగా దిగ్విజయ్ సింగ్ కూడా తప్పుకున్నారు. మల్లికార్జున ఖర్గే అధ్యక్ష ఎన్నికల బరిలోకి దిగడంతో... డిగ్గీరాజా పోటీ నుంచి తప్పుకున్నారు. ఈ నేపథ్యంలో అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న వారిలో మల్లికార్జున ఖర్గే, శశిథరూర్ మాత్రమే మిగిలారు. ఈ మధ్యాహ్నం 3 గంటలకు నామినేషన్ ప్రక్రియ ముగియనుంది. 

మరోవైపు ఈ సందర్భంగా దిగ్విజయ్ సింగ్ మాట్లాడుతూ... మల్లికార్జున ఖర్గే తనకు సీనియర్ అని... నిన్న ఆయన నివాసానికి తాను వెళ్లానని, మీరు పోటీ చేస్తే తాను బరి నుంచి తప్పుకుంటానని చెప్పానని తెలిపారు. అయితే, తాను పోటీ పడటం లేదని ఆయన అన్నారని... అయితే, అధ్యక్ష పదవికి ఖర్గే పోటీ చేయబోతున్నారంటూ మీడియాలో వస్తున్న కథనాలను తాను చూశానని, అందుకే బరినుంచి తప్పుకున్నానని చెప్పారు. తాను ఖర్గేకు మద్దతుగా నిలుస్తానని, ఆయనపై పోటీ చేసే ఆలోచనను కూడా తాను చేయనని అన్నారు. 

తన జీవితంలో ఇప్పటి వరకు కాంగ్రెస్ కే పని చేశానని, చివరి వరకు కాంగ్రెస్ తోనే ఉంటానని దిగ్విజయ్ చెప్పారు. దళితులు, గిరిజనులు, పేదలకు అండగా నిలవడం, మత సామరస్యానికి విఘాతం కలిగించే వారిపై పోరాడటం, నెహ్రూ-గాంధీ కుటుంబానికి విధేయుడిగా ఉండటం... ఈ మూడు అంశాలలో తాను ఎప్పటికీ రాజీపడలేనని అన్నారు.


More Telugu News