2008 డీఎస్సీ అభ్యర్థులకు శుభవార్త చెప్పిన తెలంగాణ హైకోర్టు

  • ఆ నోటిఫికేషన్ లో తెలంగాణలో 1815 పోస్టులు ఖాళీగా ఉన్నట్టు గుర్తించిన కోర్టు
  • వాటిని మెరిట్ అభ్యర్థులతో భర్తీ చేయాలని ఆదేశం
  • రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తీర్పునిచ్చిన న్యాయస్థానం
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉపాధ్యాయ ఖాళీల భర్తీ కోసం జరిగిన 2008 డీఎస్సీ విషయంలో తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. 14 ఏళ్ల నిరీక్షణ తర్వాత అభ్యర్థులకు న్యాయం లభించింది. ఈ  నోటిఫికేషన్‌లో భర్తీ చేయకుండా ఉన్న 1815 పోస్టులను మెరిట్‌ అభ్యర్థులతో భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఉత్తర్వులు జారీ చేసింది. 

ఉమ్మడి ఏపీలో ఇచ్చిన నోటిఫికేషన్‌లో పేర్కొన్న ఖాళీల్లో ఇప్పటిదాకా 3500 ఉద్యోగాలను భర్తీ చేయలేదని, వీటిలో 1800 పోస్టులు తెలంగాణకు చెందుతాయని హైకోర్టు గుర్తించింది. ఆ ఖాళీల్లో ఇంకా భర్తీ చేయకుండా ఉన్న ఉద్యోగాలను 2008 డీఎస్సీ రాసిన వారిలో మెరిట్‌ లిస్ట్‌ ఆధారంగా భర్తీ చేయాలని తీర్పునిచ్చింది. 

2008లో ఉమ్మడి ఏపీలో 30,558 ఖాళీల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్‌ వచ్చింది. అయితే ఇందులో 30 శాతం పోస్టులు.. (10,200) డీఈడీ అభ్యర్థులకు కేటాయిస్తూ 2009న ప్రభుత్వం జీవో జారీ చేసింది. దీన్ని సవాల్‌ చేస్తూ 69 మంది బీఈడీ అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. 

ఈ క్రమంలో, డీఈడీ అభ్యర్థులకు 30 శాతం పోస్టులు కేటాయించాలన్న ప్రభుత్వ నిర్ణయం జోలికి వెళ్లకుండా ఈ నోటిఫికేషన్ లో వెల్లడించిన మొత్తం పోస్టుల్లో ఇంకా 3,500 పోస్టులను భర్తీ చేయలేదని హైకోర్టు గుర్తించింది. రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి చెందిన ఆ పోస్టులను కాంట్రాక్ట్‌ విధానంపై భర్తీ చేసిందని, కానీ తెలంగాణకు చెందిన 1815 పోస్టులను ఇంకా భర్తీ చేయలేదని హైకోర్టు గుర్తించింది. వీటిని 2008 నోటిఫికేషన్‌లో మెరిట్‌ అభ్యర్థులతో భర్తీ చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేస్తూ తుది ఉత్తర్వులను వెలువరించింది.


More Telugu News