దసరా ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ప్రత్యేక రైళ్లు నడుపుతున్న దక్షిణమధ్య రైల్వే

  • హైదరాబాద్ నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు
  • నేటి నుంచే అందుబాటులోకి..
  • కొన్ని రైళ్ల సమయాలను సవరించిన రైల్వే
  • స్టేషన్‌కు బయలుదేరే ముందు ఎంక్వైరీకి ఫోన్ చేసి తెలుసుకోవాలన్న అధికారులు
హైదరాబాద్‌లో ఉండి దసరా కోసం ఊరెళ్లాలని భావిస్తున్న ప్రయాణికులకు దక్షిణమధ్య రైల్వే శుభవార్త చెప్పింది. దేశంలోని వివిధ ప్రాంతాలకు నేటి నుంచి ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్టు పేర్కొంది. నేడు సికింద్రాబాద్ నుంచి సంత్రాగచి (07645) మధ్య ప్రత్యేక రైలు నడుపుతున్నట్టు తెలిపింది. ఇది భువనేశ్వర్, కటక్ మీదుగా సంత్రాగచి చేరుకుంటుంది. రేపు సంత్రాగచి-సికింద్రాబాద్ (07646) మధ్య, అక్టోబరు 2న సికింద్రాబాద్-షాలిమార్ (07741), అక్టోబరు 3న షాలిమార్-సికింద్రాబాద్ (07742) మధ్య ప్రత్యేక రైళ్లు నడుపుతోంది.  

అక్టోబరు 1, 8 తేదీల్లో నాందేడ్-బర్హంపూర్ (07431), త్రివేండ్రం-టాటానగర్ (06192), అక్టోబరు 2, 9 తేదీల్లో బర్హంపూర్‌- నాందేడ్‌( 07432), అక్టోబరు 4, 11 తేదీల్లో టాటానగర్‌-త్రివేండ్రం (06191) మధ్య ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. కాగా, రేటి నుంచి బయలుదేరే కొన్ని రైళ్ల వేళలను సవరించామని, ప్రయాణికులు ఆయా స్టేషన్లకు చేరుకునే ముందు రైల్వే ఎంక్వైరీ నంబర్లకు ఫోన్ చేసి సమయాలను తెలుసుకోవాలని విజ్ఞప్తి చేశారు. 



More Telugu News