అద్భుత ఆటతో ఫైనల్ కు దూసుకెళ్లిన సచిన్ జట్టు

  • రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ లో తుదిపోరుకు ఇండియా లెజెండ్స్
  • సెమీఫైనల్లో 5 వికెట్లతో ఆస్ట్రేలియా లెజెండ్స్ పై గెలుపు
  • నేడు రెండో సెమీస్ లో వెస్టిండీస్ లెజెండ్స్ తో బంగ్లాదేశ్ పోటీ
  • రోడ్డు భద్రతపై అవగాహన కోసం నిర్వహిస్తున్న టోర్నీ
దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ నాయకత్వంలోని ఇండియా లెజెండ్స్‌ జట్టు.. రోడ్‌ సేఫ్టీ వరల్డ్‌ సిరీస్‌లో అద్భుత ప్రదర్శనతో ఫైనల్లోకి ప్రవేశించింది. సెమీ ఫైనల్లో ఇండియా లెజెండ్స్ ఐదు వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా లెజెండ్స్ పై ఘన విజయం సాధించింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌ 20 ఓవర్లలో 171/5 స్కోరు చేసింది. బెన్‌ డంక్‌ (46) టాప్ స్కోరర్ గా నిలిచాడు. అలెక్స్‌ దూలన్‌ (35), వాట్సన్‌ (30), కామెరూన్‌ వైట్‌ (30) కూడా రాణించారు. ఇండియా బౌలర్లలో అభిమన్యు మిథున్‌, యూసుఫ్‌ పఠాన్‌ చెరో రెండు వికెట్లు తీశారు. 

అనంతరం లక్ష్య ఛేదనకు వచ్చిన ఇండియా లెజెండ్స్ 19.2 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించి గెలిచింది. భారత మాజీ వికెట్ కీపర్ నమన్‌ ఓజా (62 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్లతో 90) భారీ షాట్లతో సత్తా చాటి జట్టును గెలిపించాడు. అతనితో పాటు ఇర్ఫాన్‌ పఠాన్‌ (37 నాటౌట్‌) కూడా రాణించాడు. సచిన్‌ (10), రైనా (11), యువరాజ్‌ (18), బిన్నీ (2), యూసుఫ్‌ పఠాన్‌ (1) మాత్రం ఫెయిలయ్యారు. నమన్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు లభించింది.

రోడ్డు భద్రతపై అవగాహన కోసం రాయ్ పూర్ లో నిర్వహిస్తున్న ఈ టోర్నీలో భారత్, ఆస్ట్రేలియా, శ్రీలంక, వెస్టిండీస్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, ఇంగ్లండ్ లెజెండ్స్ జట్లు బరిలో నిలిచాయి. పలువురు దిగ్గజ, మాజీ క్రికెటర్లు ఆయా దేశాల జట్లకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాగా, శుక్రవారం రాత్రి జరిగే రెండో సెమీఫైనల్లో శ్రీలంక లెజెండ్స్, వెస్టిండీస్ లెజెండ్స్ తలపడతాయి. ఇందులో గెలిచిన జట్టు శనివారం సచిన్ సేనతో ఫైనల్లో పోటీ పడుతుంది.


More Telugu News