'మీతో యుద్ధం చేయిస్తారు.. వెంటనే రష్యా వీడండి' అంటూ తమ దేశ పౌరులకు అమెరికా హెచ్చరిక

  • ఉక్రెయిన్ పై యుద్ధం తీవ్రతరం చేసేందుకు మూడు లక్షల మందితో పాక్షిక సైన్యం ఏర్పాటు చేయాలని పుతిన్ ఆదేశం
  • తక్షణమే రష్యా నుంచి బయటపడాలని సూచించిన అమెరికా ఎంబసీ
  • అమెరికన్లను నిర్బంధించి సైన్యంలో ఉపయోగించుకునే ప్రమాదం ఉందని హెచ్చరిక 
రష్యాలో ఉన్న తమ దేశ పౌరులకు అమెరికా హెచ్చరిక జారీ చేసింది. తక్షణమే ఆ దేశం విడిచి వెళ్లిపోవాలని సూచించింది. ఉక్రెయిన్ పై దాడులను రష్యా తీవ్రతరం చేస్తుందన్న వార్తల నేపథ్యంలో రష్యా రాజధాని మాస్కోలోని అమెరికా రాయబార కార్యాలయం ఈ హెచ్చరికలు చేసింది. రష్యాలో నివసిస్తోన్న 18 నుంచి 60 ఏళ్ల లోపు వయసున్న అమెరికన్లంతా వెను వెంటనే ఆ దేశం విడిచిపెట్టాలని హెచ్చరించింది. లేదంటే వారిని బలవంతంగా రష్యా సైన్యంలో చేర్చే అవకాశం ఉందని తెలిపింది. 

రష్యా విషయంలో ఇప్పటికే అనేక అంశాలు సంక్లిష్టంగా మారాయని తమ దేశ పౌరులకు అమెరికా చెప్పింది. మున్ముందు అమెరికన్లను రష్యా నుంచి బయటకు వెళ్లనీయకుండా అడ్డుకుని సైనిక సేవల కోసం నిర్బంధించవచ్చని హెచ్చరించింది. ద్వంద్వ పౌరసత్వం కలిగి ఉన్న అమెరికన్ల జాతీయతను గుర్తించేందుకు రష్యా నిరాకరించవచ్చని అభిప్రాయపడింది. రవాణా సౌకర్యాల విషయంలో ఇబ్బంది తలెత్తవచ్చని చెప్పింది. సరిహద్దు చెక్‌ పాయింట్‌లు రద్దీగా మారుతాయని, యుద్ధం నేపథ్యంలో అందుబాటులో ఉన్న కొన్ని వాణిజ్య విమానాలతో దేశం విడిచి వెళ్లడం చాలా కష్టంగా మారుతుందని తెలిపింది. ఈ నేపథ్యంలో రష్యాలో నివసిస్తున్న, ఆ దేశంలో పర్యటిస్తున్న అమెరికన్లు వెంటనే అక్కడి నుంచి బయల్దేరాలని అమెరికా రాయబార కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.
 
ఉక్రెయిన్ పై యుద్ధాన్ని తీవ్రతరం చేసేందుకు మూడు లక్షల మందితో పాక్షిక సైన్యాన్ని తయారు చేయాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ సెప్టెంబర్ 21న ఆదేశాలు జారీ చేశారు. దీనిపై అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. పాక్షిక సైన్యం విషయంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటన తర్వాత తమను నిర్బంధిస్తారేమోనన్న భయంతో వేలాది మంది ఆ దేశం విడిచి వెళ్లడానికి ప్రయత్నిస్తున్నారు. దాంతో, విమానాశ్రయాలు కిక్కిరిసిపోయి కనిపిస్తున్నాయి. రష్యా నుంచి ఫిన్లాండ్, జార్జియా, కజకిస్థాన్, మంగోలియా సరిహద్దులు దాటేందుకు ప్రయత్నిస్తున్నారు.


More Telugu News