నేడు కర్ణాటకలోకి రాహుల్ పాదయాత్ర.. పోస్టర్ల చించివేతతో కలకలం

  • రాహుల్‌ను ఆహ్వానిస్తూ చామరాజనగర్ జిల్లాలో పోస్టర్ల ఏర్పాటు 
  • కాంగ్రెస్-బీజేపీ మధ్య మాటల యుద్ధం
  • ఇది ‘భారత్ టోడో’ పనేనన్న సూర్జేవాలా
  • తమకు ఆ అవసరం లేదన్న సీఎం బొమ్మై
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో’ పాదయాత్ర నేడు కర్ణాటకలో అడుగుపెట్టనుంది. ఈ నేపథ్యంలో రాహుల్‌కు ఆహ్వానం పలుకుతూ కాంగ్రెస్ నేతలు దారిపొడవునా ఏర్పాటు చేసిన రాహుల్ పోస్టర్లను నిన్న గుర్తు తెలియని వ్యక్తులు చింపేశారు. చామరాజనగర్ జిల్లాలో రోడ్డు మధ్యలో ఏర్పాటు చేసిన ఈ పోస్టర్లను చింపివేయడంపై కాంగ్రెస్ తీవ్రంగా మండిపడింది. ఇది అధికార బీజేపీ పనేనని ఆరోపించింది. ఇది ముమ్మాటికి ‘భారత్ టోడో’ పనేనని బీజేపీని ఉద్దేశించి కర్ణాటక కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జ్ రణ్‌దీప్ సూర్జేవాలా ఆరోపించారు. 

కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్ కూడా తీవ్రంగా స్పందించారు. ధరల పెరుగుదల, నిరుద్యోగం, అసమానతలు, విభజనకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరును ఎవరూ ఆపలేరని ఆయన ట్వీట్ చేశారు. దీనిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని సూచించారు. వారు కనుక చర్యలు తీసుకోకుంటే తాము ఏం చేయాలో అది చేస్తామన్నారు. కాంగ్రెస్ ఆరోపణలపై కర్ణాటక సీఎం బసవరాజు బొమ్మై స్పందించారు. ఎవరు ‘భారత్ జోడో’ చేస్తున్నారో? ఎవరో ‘టోడో’ చేస్తున్నారో ప్రజలకు తెలుసని అన్నారు. పోస్టర్లను చింపాల్సిన అవసరం తమకు లేదని సీఎం తేల్చి చెప్పారు. కాగా, పోస్టర్ల చించివేతపై పోలీసులకు కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది.


More Telugu News