జాతీయ రాజ‌కీయాల్లో కేసీఆర్ ప్ర‌ముఖ పాత్ర పోషించాలి: 'లోక్ మ‌త్' చైర్మ‌న్ విజ‌య్ ద‌ర్దా

  • ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో కేసీఆర్‌ను క‌లిసిన రాజ్య‌స‌భ మాజీ స‌భ్యుడు దర్దా
  • జాతీయ రాజ‌కీయ ప‌రిణామాల‌పై సుదీర్ఘ చ‌ర్చ‌
  • కేసీఆర్ పాల‌నా ద‌క్ష‌త తెలంగాణ‌కే ప‌రిమితం కారాద‌న్న లోక్ మ‌త్ చైర్మ‌న్‌
టీఆర్ఎస్ అధినేత‌, తెలంగాణ సీఎం కేసీఆర్‌తో రాజ్య‌స‌భ మాజీ స‌భ్యుడు, లోక్ మ‌త్ మీడియా సంస్థ‌ల చైర్మ‌న్ విజ‌య్ ద‌ర్దా భేటీ అయ్యారు. గురువారం హైద‌రాబాద్ వ‌చ్చిన ద‌ర్దా.. ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో కేసీఆర్‌తో సమావేశమయ్యారు. ఈ సంద‌ర్భంగా జాతీయ రాజ‌కీయాలు, కేంద్రంలో సాగుతున్న బీజేపీ పాల‌న‌, బీజేపీకి ప్ర‌త్యామ్నాయ కూట‌మి ఆవ‌శ్య‌క‌త త‌దిత‌ర అంశాల‌పై వారిద్ద‌రి మ‌ధ్య సుదీర్ఘ చ‌ర్చ జ‌రిగింది. 

కేసీఆర్‌తో భేటీ అనంత‌రం మీడియాతో మాట్లాడిన విజ‌య్ ద‌ర్దా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. జాతీయ రాజ‌కీయాల్లో కేసీఆర్ ప్ర‌ముఖ పాత్ర పోషించాల‌ని ఆయ‌న అభిల‌షించారు. శాంతియుత‌ పార్ల‌మెంట‌రీ పంథాలో తెలంగాణ‌ను ప్ర‌త్యేక రాష్ట్రంగా సాధించిన కేసీఆర్ పోరాటం గొప్ప‌ద‌ని ఆయ‌న అన్నారు. అంతేకాకుండా ప్ర‌త్యేక రాష్ట్రంగా అవత‌రించిన తెలంగాణ‌ను అన‌తి కాలంలోనే కేసీఆర్ దేశంలోనే అగ్ర‌స్థానంలో నిల‌బెట్టార‌న్నారు. ప‌ట్టుద‌ల‌, ధైర్యం, రాజ‌నీతిజ్ఞ‌త‌, దార్శ‌నిక‌త క‌లిగిన రాజ‌కీయ నాయ‌క‌త్వం తెలంగాణ‌కే ప‌రిమితం కారాద‌ని ఆయ‌న అన్నారు. దేశ ప్ర‌జ‌ల గుణాత్మ‌క అభివృద్ధికి కేసీఆర్ దోహ‌దప‌డాల్సిన అవ‌స‌రం ఉంద‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు.


More Telugu News