శశి థరూర్ కు నెటిజన్ల నుంచి ట్రోలింగ్... ఎందుకంటే...!

  • కాంగ్రెస్ అధ్యక్ష పదవి రేసులో ఉన్న శశి థరూర్
  • మజ్రూ సుల్తాన్ పురి సాహిత్యంతో ట్వీట్
  • సుల్తాన్ పురిని నెహ్రూ జైల్లో పెట్టించాడన్న నెటిజన్లు
కాంగ్రెస్ పార్టీలో ఉన్న మేధావుల్లో ఒకరిగా ఎంపీ శశి థరూర్ గుర్తింపు తెచ్చుకున్నారు. తన ఆంగ్ల భాషా ప్రావీణ్యంతో అనేకమంది అభిమానులను సంపాదించుకున్నారు. ప్రస్తుతం ఆయన కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్ష పదవి రేసులో ఉన్నారు. అయితే, తాజాగా ఆయన చేసిన ఓ ట్వీట్ విమర్శలపాలైంది. థరూర్ ట్వీట్ పై నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. 

ఇంతకీ థరూర్ ఏమని ట్వీట్ చేశారంటే... బాలీవుడ్ సీనియర్ గీత రచయిత మజ్రూ సుల్తాన్ పురి ఓ పాటలో రాసిన పంక్తులను పంచుకున్నారు. 

"మై అకేలా హై చలా జానిబ్ ఈ ఘాలిగ్ మగర్... లోగ్ సాత్ ఆతే గయే ఔర్ కార్వాన్ బన్ తా గయే" అంటూ ఓ పాటలోని సాహిత్యాన్ని ట్వీట్ చేశారు. "గమ్యం దిశగా ఒక్కడ్నే అడుగులు వేయడం ప్రారంభించా... అయితే దారిపొడవునా జనం వచ్చి నాతో కలుస్తున్నారు... చూస్తే ఓ ఊరేగింపులా తయారైంది" అని తెలుగులో దానర్థం. 

అయితే, నెటిజన్లు శశి థరూర్ ఈ ట్వీట్ చేసిన ఉద్దేశాన్ని పక్కనబెట్టి మజ్రూ సుల్తాన్ పురిని గతంలో జవహర్ లాల్ నెహ్రూ జైల్లో వేయించిన అంశాన్ని తెరపైకి తెచ్చారు. థరూర్ ను ట్విట్టర్ సాక్షిగా ఏకిపారేశారు. 

  నెహ్రూకు వ్యతిరేకంగా మజ్రూ సుల్తాన్ పురి 1949లో అప్పటి పరిస్థితుల నేపథ్యంలో ఓ గేయాన్ని కూడా రచించారు. క్షమాపణలు చెప్పాలని సుల్తాన్ పురిని కోరగా, ఆయన నిరాకరించారు. దాంతో ఆయనకు రెండేళ్లపాటు జైలు తప్పలేదు. ఈ అంశాలన్నింటినీ ఎత్తిచూపుతూ నెటిజన్లు థరూర్ పై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు.


More Telugu News