కాంగ్రెస్ అధ్య‌క్ష ఎన్నిక‌ల బ‌రిలో ఆ ఇద్దరు!.. ఎవ‌రు గెలిచినా కాంగ్రెస్‌దే గెలుపు అంటూ కామెంట్‌!

  • కాంగ్రెస్ అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో దిగ్విజ‌య్‌, థ‌రూర్‌ల మ‌ధ్య పోటీ
  • థరూర్‌ను ఆయ‌న నివాసంలో క‌లిసిన దిగ్విజ‌య్‌
  • ఎన్నికల్లో త‌మ మ‌ధ్య స్నేహపూర్వ‌క పోటీనేన‌ని థరూర్ వెల్ల‌డి
కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో ఆ పార్టీ సీనియ‌ర్లు, కేంద్ర మాజీ మంత్రులు దిగ్విజ‌య్ సింగ్‌, శ‌శి థ‌రూర్‌ల మధ్య పోటీ నెల‌కొంది. అధ్య‌క్ష రేసులో అంద‌రికంటే ముందు వ‌రుస‌లో ఉన్న రాజ‌స్థాన్ ముఖ్య‌మంత్రి అశోక్ గెహ్లాట్ పోటీ నుంచి త‌ప్పుకుంటున్న‌ట్లు ప్ర‌కటించిన నేప‌థ్యంలో ఎన్నిక‌ల్లో దిగ్విజ‌య్‌, థ‌రూర్‌లు ఇద్ద‌రే నిలిచారు. ఈ క్ర‌మంలో గురువారం మ‌ధ్యాహ్నం దిగ్విజ‌య్ నేరుగా శ‌శి థ‌రూర్ నివాసానికి వెళ్లారు. దిగ్విజ‌య్‌ను సాద‌రంగా ఆహ్వానించిన థ‌రూర్‌... త‌మ ఇద్ద‌రి ఫొటోను సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు.

ఈ సంద‌ర్భంగా కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్ష ప‌ద‌వికి జ‌రుగుతున్న ఎన్నిక‌ల్లో తామిద్ద‌ర‌మే పోటీ ప‌డుతున్నామ‌ని థ‌రూర్ చెప్పుకొచ్చారు. దిగ్విజ‌య్ అభ్య‌ర్థిత్వాన్ని తాను స్వాగ‌తిస్తున్నాన‌ని థ‌రూర్ చెప్పారు. ఎన్నిక‌ల్లో తమది ప్రత్యర్థుల మధ్య పోరు కాదనీ, సహచరుల మధ్య స్నేహ‌పూర్వ‌క పోటీ మాత్రమేనని ఇద్దరం అంగీకరించామన్నారు. ఎన్నిక‌ల్లో ఎవ‌రు గెలిచినా అది కాంగ్రెస్ విజ‌య‌మేన‌ని ఆయ‌న చెప్పారు. ఇదిలా ఉంటే... ఈ ఎన్నికల్లో గురువారం నామినేషన్ పత్రాలను తీసుకున్న దిగ్విజయ్ శుక్రవారం తన నామినేషన్ పత్రాలను దాఖలు చేయనున్నారు.


More Telugu News