అమెరికా వీసాకు ముంబయిలో వెయిటింగ్ సమయం 848 రోజులు... బీజింగ్ లో మాత్రం రెండ్రోజులే!

  • భారీగా పేరుకుపోయిన వీసా దరఖాస్తులు
  • వీసా ఇంటర్వ్యూకు రెండేళ్లకు పైగా సమయం
  • బ్లింకెన్ తో ఈ విషయాన్ని ప్రస్తావించిన జైశంకర్
  • కరోనా సంక్షోభమే కారణమన్న అమెరికా విదేశాంగ మంత్రి
అగ్రరాజ్యం అమెరికాను నిత్యం లక్షల మంది విదేశీయులు సందర్శిస్తుంటారు. వీరందరికీ వీసా తప్పనిసరి. అయితే నాన్ ఇమ్మిగ్రెంట్ కేటగిరీలో అమెరికా విజిటర్ వీసా పొందడానికి వెయిటింగ్ సమయం ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు. 

న్యూఢిల్లీలోని అమెరికా ఎంబసీ/కాన్సులేట్ ద్వారా విజిటర్ వీసా పొందడానికి వెయిటింగ్ టైమ్ 833 రోజులు. అదే ముంబయి నుంచి ఈ సమయం 848 రోజులు అని అమెరికా ప్రభుత్వ వెబ్ సైట్ లో పేర్కొన్నారు. వీసా ఇంటర్వ్యూ అపాయింట్ మెంట్ కోసమే ఇంత సమయం పడుతుందట. 

అయితే, చైనాలోని బీజింగ్ నగరం నుంచి అమెరికా విజిటర్ వీసా పొందాలంటే వెయిటింగ్ సమయం కేవలం రెండ్రోజులే. పాకిస్థాన్ లోని ఇస్లామాబాద్ నుంచి వెయిటింగ్ సమయాన్ని 450 రోజులుగా పేర్కొన్నారు. ఆయా కాన్సులేట్ కార్యాలయాల్లో పెద్ద సంఖ్యలో వీసా దరఖాస్తులు పేరుకుపోతున్నాయి. వీటిని పరిష్కరించేసరికి ఏళ్లు పడుతోంది.

కాగా, భారతీయుల వీసా దరఖాస్తులు పెండింగ్ లో ఉండడం పట్ల ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ తో ఈ అంశం గురించి ప్రస్తావించారు. అందుకు ఆంటోనీ బ్లింకెన్ బదులిస్తూ కరోనా సంక్షోభం వల్ల ఈ పరిస్థితి తలెత్తిందని, ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో తమకు ఈ వీసా దరఖాస్తుల సమస్యలు తప్పడంలేదని వివరణ ఇచ్చారు. భారతీయులకు చెందిన పెండింగ్ వీసాల పరిష్కారానికి తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.


More Telugu News