8800 కి.మీ ప్ర‌యాణించి, 45 ఏళ్ల త‌ర్వాత బామ్మ‌ను వెతికిన మ‌న‌వ‌డు... వీడియో వైర‌ల్‌

  • స్పెయిన్ నుంచి బొలీవియా వ‌చ్చిన వ్య‌క్తి
  • బామ్మ‌ను క‌ల‌వ‌గానే ఇరువురి భావోద్వేగం
  • త‌న ప్ర‌యాణం మొత్తాన్ని వీడియో తీసి సోష‌ల్ మీడియాలో షేర్ చేసిన మ‌న‌వడు
చిన్న‌ప్పుడు త‌న‌ను త‌ల్లిలా లాలించి, పెంచిన నాన‌మ్మను ఓ వ్య‌క్తి 45 ఏళ్ల త‌ర్వాత తిరిగి క‌లిశాడు. ఇందుకోసం అత‌ను 8800 కిలోమీట‌ర్లు ప్ర‌యాణించాడు. ఎన్నో వ్య‌య ప్ర‌యాస‌ల‌తో స్పెయిన్ నుంచి బొలీవియా వ‌చ్చి చివ‌ర‌కు త‌న బామ్మ జాడ‌ను కనుక్కోగ‌లిగాడు. త‌న ప్ర‌యాణాన్ని మొత్తం రికార్డు చేసిన ఆ వ్య‌క్తి.. నాన‌మ్మ‌ను క‌లిసి వెంట‌నే దాన్ని సోష‌ల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు. ఇప్పుడు ఈ వీడియో నెట్‌లో వైర‌ల్‌గా మారింది. నాన‌మ్మ‌ను తిరిగి క‌లుసుకోవ‌డం కోసం అత‌ను ప‌డ్డ శ్ర‌మ‌, త‌ప‌న‌.. త‌న కోసం వ‌చ్చిన మ‌న‌వడిని ఆప్యాయంగా హ‌త్తుకున్న క్ష‌ణాలు ప్ర‌తి ఒక్క‌రినీ క‌దిలిస్తున్నాయి. 

ఈ వీడియోను గుడ్‌న్యూస్ మూవ్‌మెంట్ సంస్థ త‌మ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో షేర్ చేయ‌డంతో ప్ర‌పంచానికి తెలిసింది. "45 సంవత్సరాల తర్వాత, ఈ వ్యక్తి తన బామ్మ‌ అనాను కనుగొన్నాడు. చిన్నతనంలో అతడిని ఆమె తన సొంత కొడుకులా చూసుకున్న అపురూపమైన మహిళ' అని వీడియోకు క్యాప్ష‌న్ ఇచ్చింది. పసిబిడ్డగా ఉన్నప్పుడు బామ్మ చూపెట్టిన ప్రేమే అత‌డిని ఇంత‌దూరం తీసుకొచ్చింది అని అభిప్రాయ‌పడింది. ఈ వీడియో చూసిన వాళ్లంతా త‌మ జ్ఞాప‌కాల‌ను నెమ‌రు వేసుకుంటున్నారు. “ఇది చాలా అందంగా ఉంది. మా అక్కా‌చెల్లెళ్లు, నేను మా బామ్మ‌ను కనుగొనడానికి ప్రయత్నిస్తున్నాము, కానీ మాకు ఇంకా అదృష్టం క‌లిసి రాలేదు" అని ఓ వ్య‌క్తి ట్వీట్ చేశాడు.


More Telugu News