వివాహిత అయినా, అవివాహిత అయినా ప్ర‌తి మ‌హిళ‌కు అబార్ష‌న్‌ను ఎంచుకునే హ‌క్కు ఉంది: సుప్రీంకోర్టు

  • దేశంలో ఎవ్వ‌రైనా సుర‌క్షిత గ‌ర్భ‌స్రావానికి అర్హులేన‌ని వ్యాఖ్య‌
  • 20-24 వారాల గ‌ర్భంతో ఉన్న వారికి అబార్ష‌న్లకు నిరాక‌రించ‌డం ఆర్టికల్ 14 స్ఫూర్తికి విరుద్ధమ‌న్న కోర్టు
  • అబార్ష‌న్ కోరే మైన‌ర్ల గుర్తింపు వెల్ల‌డించాల్సిన అవ‌స‌రం లేద‌న్న న్యాయ‌స్థానం
  • మెడికల్‌ టెర్మినేషన్‌ ఆఫ్‌ ప్రెగ్నెన్సీ (ఎంటీపీ) కేసులో తీర్పు
అబార్ష‌న్ల విష‌యంలో సుప్రీంకోర్టు కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. ప్ర‌తీ మ‌హిళ‌కు అబార్ష‌న్‌ను ఎంచుకునే హ‌క్కు ఉంటుంద‌ని స్ప‌ష్టం చేసింది. మెడికల్‌ టెర్మినేషన్‌ ఆఫ్‌ ప్రెగ్నెన్సీ (ఎంటీపీ) కేసులో తీర్పును వెలువరించే సమయంలో గురువారం ఈ వ్యాఖ్య‌లు చేసింది. 

"ఎంపీటీ చట్టం ప్రకారం అవివాహిత స్త్రీలకు అబార్షన్ చేసుకునే హక్కు ఉంది. భారతదేశంలో అబార్షన్ చట్టం ప్రకారం వివాహిత, అవివాహిత స్త్రీల మధ్య ఎటువంటి భేదం చూపదు. 20-24 వారాల గర్భంతో ఉన్న ఒంటరి లేదా అవివాహిత గర్భిణీలను అబార్షన్‌కు అనుమతించకుండా నిషేధించడం, కేవ‌లం వివాహిత మహిళలనే అనుమతించడం అనేది ఆర్టికల్ 14 మార్గనిర్దేశక స్ఫూర్తికి విఘాతం కలిగిస్తుంది" అని కోర్టు తన తీర్పులో పేర్కొంది. చ‌ట్టం ఎప్పుడూ స్థిరంగా ఉండ‌కూడ‌ద‌ని, మారుతున్న సామాజిక వాస్త‌వాల‌ను కూడా ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవాల‌ని అత్యున్న‌త న్యాయ‌స్థానం అభిప్రాయ‌ప‌డింది. 

వైవాహిక అత్యాచారం కూడా అబార్షన్ల విషయంలో అత్యాచారంగానే భావించాల‌ని కోర్టు అభిప్రాయ‌ప‌డింది. అలాగే, అసురక్షిత గర్భస్రావాలపై ఆందోళన వ్యక్తం చేసింది. "అసురక్షిత గర్భస్రావాలు ప్రసూతి మరణాలకు మూడవ ప్రధాన కారణం. దేశంలో జరుగుతున్న అబార్షన్లలో 60 శాతం సురక్షితం కాదు. సురక్షితమైన అబార్షన్ సేవలకు నిరాకరించడం ద్వారా, నిర్బంధ అబార్షన్ పద్ధతులు అసురక్షితానికి దారితీస్తాయి" అని అభిప్రాయ‌ప‌డింది. 

ఇక‌, లైంగిక వేధింపులు లేదా అత్యాచారం నుంచి బయటపడిన వారిలో వివాహిత స్త్రీలు కూడా ఉండొచ్చ‌ని కోర్టు చెప్పింది. "ఒక స్త్రీ తన భర్తతో ఏకాభిప్రాయం లేని శృంగారం ఫ‌లితంగా గర్భవతి కావచ్చు. వివాహిత భాగస్వామి ద్వారా కూడా ఒక మహిళ అత్యాచారానికి పాల్పడినట్లు క్లెయిమ్ చేస్తే అబార్షన్ కోసం అత్యాచారం ఎఫ్ఐఆర్ నమోదు చేయవలసిన అవసరం లేదు” అని కోర్టు పేర్కొంది.

పోస్కో చట్టం ప్రకారం అబార్షన్ చేయమని కోరితే రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్లు మైనర్ యొక్క గుర్తింపును వెల్లడించాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు పేర్కొంది. "ఎంటీపీ మైనర్‌లకు దూరం చేయడం చ‌ట్టం ఉద్దేశం కాదు. స‌ద‌రు మహిళ ఉన్న‌ సామాజిక పరిస్థితులు ఆమె అబార్ష‌న్‌ రద్దు నిర్ణయంపై ప్రభావం చూపవచ్చు" అని కోర్టు అభిప్రాయ‌ప‌డింది.


More Telugu News