నా వెనుక లక్షలాదిమంది గాడ్ ఫాదర్స్ ఉన్నారు: మెగాస్టార్

  • 'గాడ్ ఫాదర్'గా తన పాత్ర కొత్తగా ఉంటుందన్న చిరంజీవి
  • తమన్ ను ఆకాశానికి ఎత్తేసిన తీరు 
  • ఈ సినిమా ఒక నిశ్శబ్ద విస్ఫోటనమంటూ వ్యాఖ్య 
  • అంతిమ న్యాయ నిర్ణేతలు ప్రేక్షకులేనంటూ కితాబు 
  • ప్రతి అభిమాని తనకి గాడ్ ఫాదర్ అంటూ హుషారెత్తించిన చిరూ
'గాడ్ ఫాదర్' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చిరంజీవి చాలా ఉత్సాహంతో .. ఉద్వేగంతో కనిపించారు. ఒక వైపున జోరున వర్షం కురుస్తున్నా లెక్కచేయకుండా ఆయన హుషారుగా ప్రసంగించారు. "ఈ సినిమాలో నేను చాలా గుంభనంగా .. గంభీరంగా కనిపిస్తూ, కంటి చూపుతోనే శాసించే పవర్ఫుల్ పాత్రలో కనిపిస్తాను. నా పాత్రను డిజైన్ చేసిన తీరు నాకు నచ్చింది. నేను - సల్మాన్ చేసిన డాన్స్ ను ప్రభుదేవా కంపోజ్ చేశాడు. ఆ సాంగ్ ను అందరూ ఎంజాయ్ చేస్తారు. 

సత్యదేవ్ .. మురళీశర్మ .. పూరి జగన్నాథ్ చాలా గొప్పగా చేశారు. వాళ్లందరి పాత్రలు ఈ సినిమాను ఒక రేంజ్ లో పైకి లేపుతాయి. మేమంతా ఈ సినిమాకి ఐదు ప్రాణాలుగా పనిచేస్తే ఆరోప్రాణంగా నిలిచినవాడు నా తమ్మూ తమన్. తను ఈ సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకుని వెళ్లాడు. సినిమాలలో ఎన్నో వందల ఫైట్స్ చేసిన నాకు, రామ్ లక్ష్మణ్ కంపోజ్ చేసిన ఫైట్స్ చాలా కొత్తగా అనిపించాయి. మేమంతా ఎంతగా కష్టపడినా అంతిమ న్యాయ నిర్ణేతలు మీరే. 

ఈ మధ్య కాలంలో కొంత స్తబ్దత ఏర్పడింది. నా అభిమానులను అలరించలేకపోయానే .. వాళ్ల అసంతృప్తికి కారణమయ్యానే అని చాలా బాధగా అనిపించింది. దానికి సమాధానం .. నాకు ఊరట 'గాడ్ ఫాదర్' అని నేను చెప్పగలను. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సినిమా నిశ్శబ్ద విస్ఫోటనం. అది సంభవించేది అక్టోబర్ 5వ తేదీన. నా సినిమాతో పాటు నా మిత్రుడు నాగార్జున 'ది ఘోస్ట్' కూడా విజయవంతం కావాలని కోరుకుంటున్నాను. 

మీరంతా నన్ను 'గాడ్ ఫాదర్ ' అంటున్నారు. ఏ గాడ్ ఫాదర్ లేకుండా వచ్చిన నాకు, ఈ సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి అవకాశం ఇచ్చిన ప్రతి అభిమాని నాకు గాడ్ ఫాదర్ అంటూ బిగ్గర స్వరంతో చెప్పారు. ఈ ఒక్క మాటకి జనం నుంచి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. చిరంజీవి వెనుక ఎలాంటి గాడ్ ఫాదర్స్ లేరని అంటుంటారు. ఇప్పుడు చెబుతున్నాను .. నా వెనుక లక్షలాదిమంది గాడ్ ఫాదర్స్ ఉన్నారు" అంటూ చిరంజీవి అభిమానులను మరింత హూషారెత్తించారు. 
       



More Telugu News