హెల్త్ వ‌ర్సిటీకి ఎన్టీఆర్ పేరు పున‌రుద్ధరించండి!... ఏపీ సీఎం జ‌గ‌న్‌కు మాజీ మంత్రి మండవ వెంక‌టేశ్వ‌ర‌రావు లేఖ‌!

  • హెల్త్ వ‌ర్సిటీ పేరు మార్చిన జ‌గ‌న్ స‌ర్కారు
  • సంస్థ‌ల‌కు పేరు మార్పిడి ఘ‌ట‌న‌లు విప‌రీత ప‌రిణామాలకు దారి తీస్తాయ‌న్న మండ‌వ‌
  • సిద్ధాంతాలు వేరైనా ఒక‌రినొకరు గౌరవించుకుంటూ సాగాల‌ని హిత‌వు
  • చంద్ర‌బాబు హ‌యాంలో ఆయా సంస్థ‌ల‌కు పెట్టిన పేర్ల‌ను ప్ర‌స్తావించిన మాజీ మంత్రి
ఎన్టీఆర్ యూనివ‌ర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ పేరును వైఎస్సార్ హెల్త్ వ‌ర్సిటీగా మారుస్తూ వైసీపీ స‌ర్కారు తీసుకున్న నిర్ణ‌యంపై ఉమ్మ‌డి రాష్ట్రంలో మంత్రిగా పనిచేసిన తెలంగాణ నేత‌ మండ‌వ వెంక‌టేశ్వ‌ర‌రావు బుధ‌వారం స్పందించారు. ఈ వ్య‌వ‌హారంపై పున‌రాలోచ‌న చేయాల‌ని ఆయ‌న నేరుగా ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి ఓ లేఖ రాశారు. హెల్త్ వ‌ర్సిటీకి ఎన్టీఆర్ పేరును పున‌రుద్ధ‌రించాల‌ని స‌ద‌రు లేఖ‌లో ఆయ‌న జ‌గ‌న్‌ను కోరారు.

ఆయా సంస్థ‌లకు పేర్లు, వాటిపై ఆయా ప్ర‌భుత్వాలు తీసుకున్న నిర్ణ‌యాల‌ను ఈ సంద‌ర్భంగా త‌న లేఖ‌లో మండ‌వ ప్ర‌స్తావించారు. ఉమ్మ‌డి రాష్ట్రంలో చంద్ర‌బాబు కేబినెట్‌లో మంత్రులుగా ఉన్నప్పుడే కాసు బ్ర‌హ్మానంద‌రెడ్డి పార్క్‌, జ‌ల‌గం వెంగ‌ళ‌రావు పార్క్‌, మ‌ర్రి చెన్నారెడ్డి మాన‌వ వ‌న‌రుల అభివృద్ధి కేంద్రం, కోట్ల విజ‌య‌భాస్క‌ర‌రెడ్డి ఇండోర్ స్టేడియం లాంటి పేర్ల‌ను పెట్టామ‌ని మండవ గుర్తు చేశారు. త‌మ తర్వాత అధికారంలోకి వ‌చ్చిన పార్టీలు కూడా ఆ పేర్ల‌ను అలాగే కొన‌సాగించాయన్నారు. రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత తెలంగాణ‌లోని సంస్థ‌ల‌కు పెట్టిన పేర్ల‌ను టీఆర్ఎస్ స‌ర్కారు కూడా మార్చ‌లేద‌న్నారు. 

రాజ‌కీయంగా ఎన్ని విభేదాలున్నా... సిద్ధాంత ప‌రంగా ఎన్ని విభేదాలున్నా... ఒక‌రిని మ‌రొక‌రు గౌర‌వించుకుంటూ ముందుకు సాగాల్సిన అవ‌స‌రం ఉంద‌ని మండ‌వ గుర్తు చేశారు. హెల్త్ వర్సిటీకి ఎన్టీఆర్ పేరును మార్చి అత్యున్న‌త సంప్రదాయాల‌ను కాలరాసిన‌ట్టయిందని మండవ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. అసలు ఇలాంటి విష‌యంపై ఏపీ సీఎంకు తాను లేఖ రాస్తాన‌ని ఎన్న‌డూ అనుకోలేద‌ని కూడా మండ‌వ అన్నారు. ఈ త‌ర‌హా పేరు మార్పిడి య‌త్నాలు విప‌రీత ప‌రిణామాల‌కు దారి తీస్తామ‌ని ఆయ‌న ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.


More Telugu News