కొత్త రైల్వే జోన్ పై రైల్వే బోర్డు చైర్మన్ తోనే ప్రకటన చేయిస్తా: జీవీఎల్

  • విశాఖ రైల్వే జోన్ పై కేంద్రం విరమించుకుందంటూ వార్తలు
  • కొత్త రైల్వే జోన్ ఏర్పాటుపై కేంద్రం సిద్ధంగా ఉందన్న జీవీఎల్  
  • అసత్య ప్రచారం సరికాదని హితవు
  • మీడియా వాస్తవాలు తెలుసుకోవాలని సూచన
విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుపై కేంద్రం విరమించుకుందంటూ వార్తలు రావడం తెలిసిందే. దీనిపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు స్పందించారు. కొత్త రైల్వే జోన్ ఏర్పాటుకు కేంద్రం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. 
 
పత్రికలు కొందరి కుయుక్తులకు లోబడి అసత్య కథనాలు ప్రచారం చేయడం సరికాదని హితవు పలికారు. మీడియా ఈ అంశంలో అపోహలు పెంచే విధంగా ప్రచారం చేస్తుండడం బాధాకరమని అన్నారు. కొత్త రైల్వే జోన్ పై రైల్వే బోర్డు చైర్మన్ త్రిపాఠీతోనే ప్రకటన చేయిస్తానని వెల్లడించారు. అంతేకాదు, రైల్వే జోన్ ఏర్పాటుపై పార్లమెంటులో రైల్వే మంత్రి చేసిన ప్రకటనను కూడా జీవీఎల్ చదివి వినిపించారు. 

వైసీపీ ప్రభుత్వం ప్రజాసమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. వైసీపీ ఉచ్చులో టీడీపీ మరోసారి పడిందని జీవీఎల్ అన్నారు. రాష్ట్రాల మధ్య ఉన్న వివాదాల పరిష్కారానికి చర్చ జరగాలని అన్నారు. రౌడీయిజం, సెటిల్ మెంట్ తరహాలో సమస్య పరిష్కారం కాదని అభిప్రాయపడ్డారు. సమస్యల పరిష్కారం కోసం ముఖ్యమంత్రులు జగన్, కేసీఆర్ ఎన్నిసార్లు కలిశారని జీవీఎల్ నిలదీశారు. 

కేవలం వ్యక్తిగత ప్రయోజనాల కోసమే కేసీఆర్, జగన్ కలుస్తారా? ఏపీకి జరుగుతున్న అన్యాయంపై సీఎంకు చర్చించే తీరికే లేదా? అని ప్రశ్నించారు. ఇక్కడ కలవరు కానీ, ఢిల్లీ వెళ్లి డ్రామాలు చేస్తారు అంటూ మండిపడ్డారు. కేసీఆర్ నుంచి వ్యక్తిగతంగా జగన్ ఏమి ఆశిస్తున్నారో చెప్పాలని అన్నారు. వైసీపీ ప్రభుత్వం స్వార్థాన్ని పక్కనబెట్టి కేసీఆర్ ను ప్రశ్నించాలని జీవీఎల్ డిమాండ్ చేశారు.


More Telugu News