నేడు సోనియాతో గెహ్లాట్ భేటీ.. తేల‌నున్న రాజస్థాన్ సీఎం భ‌విత‌వ్యం!

  • కాంగ్రెస్ జాతీయ అధ్య‌క్ష ప‌ద‌వికి పోటీ విష‌యంలో నిర్ణ‌యం తీసుకోనున్న గెహ్లాట్
  • రాజ‌స్థాన్ కాంగ్రెస్ లో సంక్షోభంపై సోనియాకు నివేదిక ఇచ్చిన ఖ‌ర్గే, మాకెన్‌
  • గెహ్లాట్ స‌న్నిహిత నాయ‌కుల‌పై క్ర‌మ‌శిక్ష‌ణ చ‌ర్య‌ల‌కు సిఫార‌సు
రాజస్థాన్ లో రాజ‌కీయ సంక్షోభం ఏర్ప‌డిన త‌ర్వాత ఆ రాష్ట్ర‌ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఈ రోజు ఢిల్లీలో కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీతో స‌మావేశం కానున్నారు. కాంగ్రెస్ జాతీయ‌ అధ్యక్ష పదవికి తన నామినేషన్‌ను దాఖలు చేసే విష‌యంలో ముందుకు వెళ్లాలా? వ‌ద్దా? అనే విష‌యాన్ని ఈ భేటీ త‌ర్వాత గెహ్లాట్ తేల్చుకోనున్నారు. అదే స‌మ‌యంలో గెహ్లాట్‌ను రాజ‌స్థాన్ ముఖ్య‌మంత్రిగా కొన‌సాగించాలా? వ‌ద్దా? అనే దానిపై కూడా కాంగ్రెస్ అధిష్ఠానం నుంచి ప్ర‌క‌ట‌న వెలువ‌డే అవ‌కాశం క‌నిపిస్తోంది. దాంతో, ఈ భేటీకి ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. 

గెహ్లాట్ వ‌ర్గానికి చెందిన 82 మంది ఎమ్మెల్యేలు ఆదివారం రాత్రి అసెంబ్లీ స్పీకర్ సీపీ జోషికి త‌మ రాజీనామా సమర్పించడంతో రాజ‌స్థాన్‌లో రాజకీయ డ్రామా మొదలైంది. గెహ్లాట్‌ కాంగ్రెస్ అధ్యక్ష పదవి చేప‌డితే తదుపరి ముఖ్యమంత్రిగా సచిన్ పైలట్ వ‌ద్దంటూ రాజీనామా చేసిన ఎమ్మెల్యేలు మూడు పాయింట్ల ఎజెండాను ఇచ్చారు. 

2020 జూన్‌లో ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నం జరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీకి విధేయులుగా ఉన్న 102 మంది ఎమ్మెల్యేలు కోరిన వాళ్ల‌నే ముఖ్యమంత్రిని చేయాల‌ని డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ కు నూత‌న అధ్యక్షుడిని నియమించిన తర్వాత రాజస్థాన్‌లో నాయకత్వ మార్పుపై చర్చలు జరగాలని గెహ్లాట్ శిబిరంలోని ఎమ్మెల్యేలు పార్టీ హైకమాండ్‌కు తెలియజేశారు. ప్ర‌స్తుత సీఎం అశోక్ గెహ్లాట్ అభిప్రాయాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాల‌ని స్ప‌ష్టం చేశారు.

ఈ ప‌రిణామం కాంగ్రెస్ నాయకత్వం, గెహ్లాట్ విధేయుల మధ్య ప్రతిష్ఠంభనకు దారితీసింది. రాజ‌స్థాన్‌లో జ‌రుగుతున్న ప‌రిణామాల‌పై కాంగ్రెస్ హైకమాండ్ పార్టీ పరిశీలకులు మల్లికార్జున్ ఖర్గే, అజయ్ మాకెన్ నుంచి స‌మ‌గ్ర నివేదిక‌ను కోరింది. రంగంలోకి దిగిన ఖర్గే, మాకెన్‌.. రాష్ట్రంలో సంక్షోభానికి గెహ్లాట్ బాధ్యులు కాదని సోనియా గాంధీకి అంద‌జేసిన తమ నివేదికలో పేర్కొన్నారు. 

అయితే, అదే స‌మ‌యంలో గెహ్లాట్ వ‌ర్గానికి చెందిన ప‌లువురు ప్రముఖ నాయకులపై క్రమశిక్షణా చర్యలకు సిఫార్సు చేశారు. శాంతి ధరివాల్, మహేశ్ జోషి, ఎమ్మెల్యే ధర్మేంద్ర రాథోడ్‌ సహా గెహ్లాట్ శిబిరానికి చెందిన పలువురు కేబినెట్ మంత్రులు కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ (సీఎల్ పీ)ని కాద‌ని మ‌రో సమాంతర సమావేశాన్ని నిర్వహించారని ఆరోపించారు. వీరిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అధిష్ఠానం భావిస్తోంది. ఈ నేప‌థ్యంలో ప‌లువురు మంత్రుల‌పై వేటు ప‌డే అవ‌కాశం క‌నిపిస్తోంది.


More Telugu News