పీఎఫ్ఐపై కేంద్రం కొరడా.. నిషేధం విధింపు

  • పీఎఫ్ఐ దాని అనుబంధ సంస్థలపై ఐదేళ్లపాటు నిషేధం
  • నిషేధం తక్షణమే అమల్లోకి వస్తుందన్న కేంద్రం
  • 2007లో మూడు సంస్థలు ఒక్కటై పీఎఫ్ఐగా ఆవిర్భావం
పాప్యులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ)పై కేంద్రం కొరడా ఝళిపించింది. ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు సమకూర్చడం, ఉగ్రవాదంపై యువతకు శిక్షణ వంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న పీఎఫ్ఐ కార్యాలయాలపై ఇటీవల జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) దేశవ్యాప్తంగా సోదాలు నిర్వహించింది. ఈ సందర్భంగా పదుల సంఖ్యలో ఆ సంస్థ సభ్యులను అరెస్ట్ చేసింది. 

ఈ నేపథ్యంలో కేంద్రం తాజాగా పీఎఫ్ఐ, దానికి అనుబంధంగా కొనసాగుతున్న 8 సంస్థలపై ఐదేళ్ల పాటు నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇవి తక్షణమే అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. యూఏపీఏ చట్టం కింద ఈ సంస్థపై వేటేసినట్టు తెలిపింది. కాగా, ఇటీవల పాట్నాలో  ప్రధానమంత్రి మోదీ హత్యకు పీఎఫ్ఐ కుట్ర చేసినట్టు కూడా ఆరోపణలు ఉన్నాయి. 

స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్‌మెంట్ ఆఫ్ ఇండియా (సిమి)పై కేంద్రం నిషేధం విధించిన తర్వాత కేరళలోని నేషనల్ డెమొక్రటిక్ ఫ్రంట్, కర్ణాటకలోని ఫోరం ఫర్ డిగ్నిటీ, తమిళనాడులోని మనితా నీతి పసరాయ్ సంస్థలు కలిసి 2007లో పాప్యులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాగా ఆవిర్భవించాయి.

పీఎఫ్ఐ అనుబంధ సంస్థలివే..
* రెహాబ్ ఇండియా ఫౌండేషన్ (ఆర్ఐఎఫ్) 
* క్యాంపస్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (సీఎఫ్ఐ)
* ఆల్ ఇండియా ఇమామ్స్ కౌన్సిల్ (ఏఐఐసీ)
* నేషనల్ కాన్ఫెడరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ (ఎన్సీహెచ్ఆర్వో)
* నేషనల్ విమెన్స్ ఫ్రంట్ (ఎన్‌డబ్ల్యూఎఫ్)
* జూనియర్ ఫ్రంట్ (జేఎఫ్)
* ఎంపవర్ ఇండియా ఫౌండేషన్ (ఈఐఎఫ్)
* రెహాబ్ ఫౌండేషన్ (కేరళ)


More Telugu News