చుట్టుముట్టిన ఏనుగులు.. భయంతో గంటన్నరపాటు చెట్టుపైనే యువకుడు! వీడియో చూడండి

  • కేరళలోని ఇడుక్కి జిల్లాలో ఘటన
  • పొలానికి వెళ్తుండగా దూసుకొచ్చిన ఏనుగులు
  • భయంతో చెట్టెక్కి గంటన్నరపాటు దానిపైనే గడిపిన యువకుడు
  • టపాసులు కాల్చి ఏనుగులను తరిమికొట్టిన అటవీ అధికారులు
ఒంటరిగా వెళ్తున్నప్పుడు ఏనుగుల మంద కంటపడితే.. అది మనవైపే దూసుకొస్తే! అయ్య బాబోయ్ ఇంకేమైనా ఉందా? గుండె ఆగిపోయినంత పని అవుతుంది. కేరళలో ఓ వ్యక్తికి ఇలాంటి ఘటనే ఎదురైంది. ఏనుగులను కవ్వించకున్నా అవి తనవైపే దూసుకొస్తుండడంతో అతడి పైప్రాణాలు పైనే పోయినంత పనైంది. అయితే,  ఓ చెట్టు అతడి ప్రాణాలను కాపాడింది. కేరళలోని ఇడుక్కి జిల్లాలో జరిగిందీ ఘటన. 

సింగుకండమ్‌కు చెందిన సాజీ తన పొలానికి వెళ్తుండగా ఏనుగుల మంద ఒకటి అక్కడ ఉండడాన్ని చూశాడు. ఈలోగా వాటి దృష్టి అతడిపై పడింది. అంతే.. పరుగుపరుగున అవి అతడివైపు రావడంతో సాజి భయంతో వణికిపోయాడు. ఒక్కడే ఉండడంతో ఏం చేయాలో పాలుపోలేదు. చివరికి చుట్టూ చూస్తే సమీపంలోనే ఓ పొడవాటి చెట్టు కనిపించింది. అంతే, మరేమీ ఆలోచించకుండా దానిని గబగబ ఎక్కేశాడు. 

అయితే, అక్కడితో సమస్యకు శుభంకార్డు పడలేదు. ఏనుగులు అక్కడే అతని కోసం కాసుక్కూర్చున్నాయి. ఇది అతడిని మరింత భయాందోళనలకు గురిచేసింది. సమయం గడుస్తున్నా అవి అక్కడే అతడి కోసం కాపు కాయడంతో ఇక లాభం లేదని చెట్టుపై నుంచే అరుస్తూ స్థానికులను అప్రమత్తం చేశాడు. చివరికి అతడి అరుపులు విన్న వారందరూ అక్కడికి చేరుకుని వాటిని తరిమికొట్టి అతడిని రక్షించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ ఫలితం లేకపోవడంతో అటవీ అధికారులకు సమాచారం అందించారు. 

వారు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని టపాసులు పేల్చి వాటిని బెదరగొట్టి అక్కడి నుంచి పంపించారు. దాదాపు గంటన్నరపాటు చెట్టుపైనే బిక్కుబిక్కుమంటూ గడిపిన సాజి ఏనుగులు అటు వెళ్లగానే కిందకి దిగి ఊపిరి పీల్చుకున్నాడు. వైరల్ అవుతున్న ఈ వీడియోను మీరూ చూడండి!



More Telugu News