జపాన్ మాజీ ప్రధాపి షింజో అబేకు ఘననివాళి అర్పించిన ప్రధాని మోదీ

  • జులైలో హత్యకు గురైన షింజో అబే
  • ప్రైవేటుగా అంత్యక్రియలు నిర్వహించిన కుటుంబసభ్యులు
  • నేడు అధికారిక లాంఛనాలతో తుది వీడ్కోలు
  • హాజరైన ప్రధాని మోదీ
హత్యకు గురైన జపాన్ మాజీ ప్రధాని షింజో అబేకు నేడు ప్రభుత్వ లాంఛనాలతో తుది వీడ్కోలు పలికారు. టోక్యోలో జరిగిన ఈ కార్యక్రమానికి భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా హాజరయ్యారు. షింజో అబే స్మారకం వద్ద ఘననివాళి అర్పించారు.

ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ, షింజో అబే గొప్ప నాయకుడు అని, మహోన్నత వ్యక్తిత్వం ఆయన సొంతం అని కీర్తించారు. భారత్-జపాన్ మైత్రిపై ఆయనకు ఎనలేని నమ్మకం అని వెల్లడించారు.

ఈ ఏడాది ఆరంభంలో టోక్యో వచ్చానని, కానీ ఇలా షింజో అబే తుది వీడ్కోలు కార్యక్రమానికి మళ్లీ రావాల్సి వస్తుందని ఏమాత్రం ఊహించలేదని మోదీ విచారం వ్యక్తం చేశారు. కోట్లాది మంది హృదయాల్లో ఆయన చిరస్థాయిగా నిలిచిపోతారని పేర్కొన్నారు. 

గత జులై నెలలో నరా నగరంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న షింజో అబేపై ఓ మాజీ సైనికుడు దేశవాళీ తుపాకీతో కాల్పులు జరిపాడు. తీవ్రంగా గాయపడిన అబే మృత్యువుతో పోరాటంలో ఓడిపోయి జపాన్ ను విషాదంలో ముంచెత్తారు. 

కాగా, షింజో అబే అంత్యక్రియలను కుటుంబ సభ్యులు ఇప్పటికే ప్రైవేటుగా నిర్వహించగా, ఇవాళ ప్రభుత్వ లాంఛనాలతో వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమానికి 100కి పైగా దేశాల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు. వారిలో 20 మంది వరకు దేశాధినేతలు ఉన్నారు.


More Telugu News