తెలంగాణలో మరో మూడు రోజులు భారీ వర్షాలు.. ఏయే జిల్లాల్లో ఎంత వాన పడొచ్చనే వివరాలివీ..1

  • వర్షపాతం అంచనాలను విడుదల చేసిన హైదరాబాద్ వాతావరణ కేంద్రం
  • దక్షిణ తెలంగాణ జిల్లాల్లో విస్తారంగా వానలు పడతాయని వెల్లడి
  • బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనమే దీనికి కారణమని వివరణ
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో.. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వచ్చే మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడతాయని.. మరికొన్నిచోట్ల ఓ మోస్తరు వానలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

వచ్చే నెల (అక్టోబర్) ఒకటో తేదీన తూర్పు, మధ్య బంగాళాఖాతంలో మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని.. దానివల్ల వర్షాలు మరికొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉందని వెల్లడించింది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా వానలు పడుతున్నాయని, హైదరాబాదులో భారీ వర్షం కురిసిందని తెలిపింది.

ఏయే జిల్లాల్లో వర్షపాతం ఎలా?
  • సెప్టెంబర్ 28వ తేదీన (బుధవారం) తెలంగాణ వ్యాప్తంగా వానలు పడతాయని.. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాల్లో ఓ మోస్తరుగా.. మిగతాచోట్ల భారీ వానలు కురుస్తాయని తెలిపింది.
  • సెప్టెంబర్ 29న (గురువారం) ఆదిలాబాద్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, కరీంనగర్, పెద్దపల్లి, జనగాం, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో సాధారణ వానలు.. మిగతా చోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని సూచించింది
  • సెప్టెంబర్ 30న (శుక్రవారం) నిర్మల్, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, వికారాబాద్, రంగారెడ్డి, గ్రేటర్ హైదరాబాద్, నారాయణపేట్, మహబూబ్ నగర్, గద్వాల, వనపర్తి, నాగర్ కర్నూల్, నల్లగొండ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. మిగతా జిల్లాల్లో ఓ మోస్తరు వానలు పడతాయని వివరించింది.


More Telugu News