సుప్రీంలో ఉద్ధ‌వ్ థాక‌రేకు ఎదురుదెబ్బ.. ఎన్నికల సంఘం ప్రొసీడింగ్స్ పై స్టేకు నిరాకరణ!

  • త‌మ‌దే అస‌లైన శివ‌సేన‌గా గుర్తించాల‌ని ఎన్నికల సంఘానికి షిండే ‌విజ్ఞప్తి 
  • ఎన్నికల సంఘం ప్రొసీడింగ్స్ పై స్టే ఇవ్వాలని కోరుతూ ఉద్దవ్ సుప్రీంలో పిటిషన్  
  • నేడు విచారించిన ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం  
  • అస‌లైన శివ‌సేన‌ను గుర్తించే హ‌క్కు ఈసీకి ఉంద‌న్న కోర్టు
శివ‌సేన అధినేత‌, మ‌హారాష్ట్ర మాజీ ముఖ్య‌మంత్రి ఉద్ధ‌వ్ థాక‌రేకు మంగ‌ళ‌వారం సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ త‌గిలింది. కేంద్ర ఎన్నిక‌ల సంఘం (ఈసీ) అర్హ‌త‌ను ప్ర‌శ్నిస్తూ థాక‌రే ధాఖలు చేసిన పిటిష‌న్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. మ‌హారాష్ట్రలో ఇటీవ‌ల నెల‌కొన్న రాజ‌కీయ సంక్షోభంలో భాగంగా శివ‌సేన‌కు చెందిన మెజారిటీ ఎమ్మెల్యేల‌ను ప్ర‌స్తుత సీఎం ఏక్‌నాథ్ షిండే త‌న‌వైపున‌కు తిప్పుకున్నారు. ఈ క్ర‌మంలో మెజారిటీ ఎమ్మెల్యేలు ఉన్న త‌మ వ‌ర్గాన్నే అసలైన శివ‌సేన‌గా గుర్తించాల‌ని షిండే కేంద్ర ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేస్తూ దరఖాస్తు చేశారు.  

ఈ క్రమంలో దీనిని సవాల్ చేస్తూ ఉద్ధ‌వ్ థాక‌రే సుప్రీంకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు. ఈ విషయంలో ఎన్నిక సంఘం ముందుకు వెళ్లకుండా, ఈసీ ప్రొసీడింగ్స్ పై స్టే విధించాలని కోరారు. దీనిని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం నేడు విచారించింది. అస‌లైన శివ‌సేన ఏది అన్న విష‌యాన్ని నిర్ధారించే హ‌క్కు, అర్హ‌త రాజ్యాంగ బద్ధ సంస్థ అయిన ఎన్నిక‌ల సంఘానికే ఉన్నాయ‌ని సుప్రీంకోర్టు అభిప్రాయ‌ప‌డింది. ఈ క్ర‌మంలోనే ఉద్ధ‌వ్ థాక‌రే పిటిష‌న్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.


More Telugu News