తెలుగులో రాగులు.... ఇంగ్లీషులో ఫింగర్ మిల్లెట్స్... లాభాలేంటో చూద్దాం!

  • ఎంతో చవకగా లభించే రాగులు
  • రాగుల్లో సమృద్ధిగా పోషకాలు
  • కీలకమైన అమైనో ఆమ్లాలకు కేరాఫ్ అడ్రస్ రాగులు
  • అన్ని వయసుల వారికి ఉపయుక్తమైన ఆహారం
  • తృణధాన్యాల్లో ప్రముఖమైనవి రాగులు
ఎంతో చవకగా లభ్యం కావడమే కాకుండా, పోషక విలువలు సమృద్ధిగా కలిగివుండే తృణధాన్యాల్లో రాగులు ప్రముఖమైనవి. వీటినే ఇంగ్లీషులో ఫింగర్ మిల్లెట్స్ అంటారు. పీచు పదార్థం (ఫైబర్) అత్యధికంగా ఉండే రాగులను ఆహారంలో భాగంగా తీసుకోవాలని వైద్యులు తప్పక చెబుతుంటారు. 

రాగుల్లో ఉన్నన్ని ఖనిజ లవణాలు మరే ఇతర తృణధాన్యాల్లోనూ ఉండవు. రాగులతో జావ, సంగటి, బూరెలు, బిస్కెట్లు తదితర రుచికరమైన ఆహార పదార్థాలు తయారుచేసుకోవచ్చు. రాగులను అన్ని వయసుల వారు తీసుకోవచ్చు.

రాగులు హృదయ సంబంధ సమస్యలను అరికట్టడంలోనూ, టైప్-2 మధుమేహాన్ని నివారించడంలో తోడ్పడతాయి. ఇందులోని ఫైటోకెమికల్స్ జీర్ణక్రియ వేగాన్ని తగ్గిస్తాయి. తద్వారా రక్తంలోకి గ్లూకోజ్ నిదానంగా విడుదలవుతుంది. ఆ విధంగా రక్తంలో గ్లూకోజ్ స్థాయులు నియంత్రణలో ఉంటాయి. 

ఊబకాయులు బరువు తగ్గేందుకు రాగులు ఎంతగానో ఉపయుక్తం అని నిపుణులు చెబుతుంటారు. రాగుల్లోని పీచు పదార్థం కడుపు నిండిన భావన కలిగిస్తుంది. రాగుల్లో ఉండే ట్రిప్టోఫాన్ అనే అమైనో యాసిడ్ ఆకలిని తగ్గిస్తుంది. తద్వారా అధికంగా ఆహారం తీసుకోవాల్సిన పని ఉండదు. అధిక కాలరీలు పోగుపడకుండా చూస్తాయి. ఈ ట్రిప్టోఫాన్ అమైనో ఆమ్లం మానసిక ఆందోళనను తగ్గిస్తుంది. డిప్రెషన్, నిద్రలేమి తదితర మానసిక సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.  

రాగుల గురించి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే... వీటిలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. రాగులను ఆహారంగా స్వీకరించడం వల్ల ఎముకలు బలంగా తయారవుతాయి. పిల్లలు, వృద్ధుల్లో ఎముక పుష్టికి ఇది ఉపయోగపడుతుంది. 

రాగుల్లో ఉండే లెసిథిన్, మెథియోనైన్ అనే అమైనో యాసిడ్లు కాలేయంలో పేరుకుపోయిన కొవ్వును కరిగిస్తాయి. థ్రియోనైన్ అనే మరో అమైనో యాసిడ్ కాలేయంలో కొవ్వు ఏర్పడకుండా నివారిస్తుంది. 

ఇక, రాగుల్లో ఉండే ఐరన్ వల్ల రక్తహీనత సమస్య దరిచేరదు. కండర కణజాల సమన్వయానికి రాగులు ఎంతగానో తోడ్పడతాయి.


More Telugu News