కరోనా బారినపడిన పిల్లలకు డయాబెటిస్ ముప్పు: తాజా అధ్యయనంలో వెల్లడి

  • 13 దేశాల్లో 10 లక్షల మంది పిల్లలపై అధ్యయనం
  • కొవిడ్ సోకని పిల్లలతో పోలిస్తే సోకిన వారిలో 73 శాతం అధికముప్పు
  • కరోనా సోకిన ఆరు నెలల్లోపే మధుమేహం బారినపడుతున్న చిన్నారులు
కరోనా మహమ్మారి బారినపడి ఆ తర్వాత బయటపడినా దాని ప్రభావం చాలా కాలం ఉంటున్నట్టు పలు అధ్యయనాలు ఇప్పటికే తేల్చాయి. కోవిడ్ అనంతర సమస్యల కారణంగా మరణాలు కూడా చేసుకున్న ఘటనలు ఉన్నాయి. ఇక, ‘లాంగ్ కొవిడ్’ గురించి చెప్పక్కర్లేదు. తాజాగా నిర్వహించిన అధ్యయనాల్లో మరో ఆందోళనకర విషయం వెలుగు చూసింది. కరోనా బారినపడిన చిన్నారులు, కౌమార దశలో ఉన్న పిల్లలకు టైప్-1 డయాబెటిస్ ముప్పు బాగా పెరుగుతున్నట్టు ఈ అధ్యయనం తేల్చింది. 13 దేశాల్లో 18 ఏళ్లలోపు వయసున్న 10 లక్షల మందిపై నిర్వహించిన అధ్యయనం అనంతరం పరిశోధకులు ఈ నిర్ధారణకు వచ్చారు.

కరోనా సోకిన 6 నెలల్లోపు వీరిలో చాలామంది మధుమేహం బారినపడుతున్నట్టు వారు గుర్తించారు. కొవిడ్ బారినపడని వారితో పోలిస్తే పడిన వారిలో ఈ ముప్పు 73 శాతం అధికంగా ఉన్నట్టు తేలింది. అయితే, దీనికి ఈ ఇన్ఫెక్షనే కారణమా? అన్న విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. నిన్నమొన్నటి వరకు ప్రపంచవ్యాప్తంగా ఒబేసిటీ (స్థూలకాయం) అతిపెద్ద సమస్యగా మారగా ఇప్పుడా స్థానాన్ని డయాబెటిస్ ఆక్రమిస్తోంది. టైప్-1 డయాబెటిస్‌ను ఆటో ఇమ్యూన్ వ్యాధిగా చెబుతారు.


More Telugu News