వైస్రాయ్ హోటల్ వద్ద ఆనాడు చెప్పులు వేసింది లక్ష్మీపార్వతిపైనే కావచ్చు: రఘురామ కృష్ణరాజు

  • ఎన్టీఆర్‌ పేరు మార్పుపై లక్ష్మీపార్వతి స్పందన ఆమె నైజానికి నిదర్శనమన్న రఘురామ రాజు
  • ఆమె స్పందనతో టీడీపీ సంక్షోభంపై అనుమానాలు తొలగిపోయి ఉంటాయన్న ఎంపీ
  • జగన్ వెనక్కి తగ్గకుంటే ప్రజలు కూడా తగ్గరని హెచ్చరిక
డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరు మార్పు సబబే అన్న వైసీపీ నేత లక్ష్మీపార్వతి వ్యాఖ్యలపై నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు స్పందించారు. ఢిల్లీలో నిన్న విలేకరులతో మాట్లాడిన ఆయన.. లక్ష్మీపార్వతి స్పందించిన తీరుతో నాటి టీడీపీ సంక్షోభంపై ఎవరికైనా అనుమానాలు ఉంటే అవి తొలగిపోయి ఉంటాయని అన్నారు. ఎన్టీఆర్ పేరు మార్పుకు నిరసనగా కనీసం మాటవరసకైనా రాజీనామా చేస్తానని అనకపోవడం ఆమె నైజానికి అద్దం పడుతోందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్‌కు అది చేశారు, ఇది చేశారని ఊదరగొట్టడానికి ముందు తల్లికి, చెల్లికి వెన్నుపోటు, బాబాయికి గొడ్డలిపోటు వేసింది ఎవరో పరిశీలించాలని సూచించారు. 

ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరు మార్పును జగన్ చెల్లెలు షర్మిల ‘సిల్లీ’ అని తీసి పడేశారన్న రఘురామ రాజు.. కాబట్టి ఈ విషయంలో జగన్ ఒకటి రెండుసార్లు ఆలోచించాలని సూచించారు. పేరు మార్పుపై వెనక్కి తగ్గకపోతే ప్రజలు ప్రభుత్వాన్ని మార్చడంలోనూ వెనక్కి తగ్గరని హెచ్చరించారు. ఎన్టీఆర్ స్థాయి ఒక అర జిల్లా కాదని అన్నారు. పేరు మార్పుపై నటుడు బాలకృష్ణ చేసిన ట్వీట్‌లను రఘురామ రాజు సమర్థించారు. ఎన్టీఆర్ తన పిల్లలకు ఆస్తులు పంచారని, కానీ వైఎస్సార్ మాదిరిగా ఓవర్‌నైట్ కోటీశ్వరులను చేయలేదని విమర్శించారు. నాడు వైస్రాయ్ హోటల్ వద్ద టీడీపీ నేతలు లక్ష్మీపార్వతిపై చెప్పులు వేసి ఉంటారని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.


More Telugu News