షింజో అబేకు అధికారికంగా తుది వీడ్కోలు పలికేందుకు జపాన్ పయనమైన ప్రధాని మోదీ

  • జులై 8న హత్యకు గురైన జపాన్ మాజీ ప్రధాని
  • రేపు అధికారిక లాంఛనాలతో తుది వీడ్కోలు 
  • హాజరుకానున్న భారత ప్రధాని
  • జపాన్ ప్రధాని కిషిదాతో భేటీ అయ్యే అవకాశం
ఇటీవల హత్యకు గురైన జపాన్ మాజీ ప్రధాని షింజో అబే అధికారిక తుది వీడ్కోలు కార్యక్రమం రేపు టోక్యోలో నిర్వహించనున్నారు. ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా హాజరవుతున్నారు. అందుకోసం మోదీ కొద్దిసేపటి కిందట ప్రత్యేక విమానంలో జపాన్ పయనమయ్యారు. 

అంతకుముందు ప్రధాని మోదీ ట్వీట్ చేస్తూ, ఈ రాత్రికి టోక్యో వెళుతున్నానని వెల్లడించారు. మాజీ ప్రధాని షింజో అబే తుది వీడ్కోలు కార్యక్రమానికి హాజరవుతానని, షింజో అబే తనకు అత్యంత సన్నిహితుడని, భారత్-జపాన్ మైత్రికి సంబంధించి ఆయన గొప్ప విజేత అని మోదీ అభివర్ణించారు. 

షింజో అబే వంటి మహోన్నత నేతను కోల్పోయినందుకు జపాన్ ప్రధాని ఫుమియో కిషిదా, అబే అర్ధాంగికి భారతీయులందరి తరఫున ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నామని వివరించారు. షింజో అబే ఆశయాలను కొనసాగిస్తూ భారత్, జపాన్ సంబంధాల బలోపేతానికి కృషి చేస్తామని తెలిపారు. 

కాగా, జపాన్ పర్యటన సందర్భంగా మోదీ.... జపాన్ ప్రధాని ఫుమియో కిషిదాతో స్వల్పకాలిక భేటీలో పాల్గొంటారని తెలుస్తోంది. జులై 8న ఎన్నికల ప్రచారం సందర్భంగా షింజో అబే ఓ మాజీ సైనికుడి చేతిలో హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కొన్నిరోజులకు కుటుంబ సభ్యులు ప్రైవేటుగా అంత్యక్రియలు నిర్వహించారు. అయితే, అబే వంటి గొప్పనేతకు అధికారికంగా వీడ్కోలు పలకాలని జపాన్ ప్రధాని ఫుమియో కిషిదా నిర్ణయించారు.


More Telugu News