అమ‌రావ‌తి రైతులు చేసింది త్యాగ‌మెలా అవుతుంది?: మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ‌

  • త‌ల‌చుకుంటే అమ‌రావతి రైతుల యాత్ర 5 నిమిషాల్లో ఆగిపోతుంద‌న్న మంత్రి
  • ఆ వ్యాఖ్య‌ల‌కు క‌ట్టుబ‌డి ఉన్నాన‌న్న బొత్స‌
  • పోల‌వ‌రం, నాగార్జున సాగ‌ర్ ప్రాజెక్టుల‌కు భూములిచ్చిన రైతుల‌ది త్యాగ‌మ‌ని వెల్ల‌డి
  • ప్ర‌భుత్వం నుంచి ప్ర‌యోజ‌నం పొందిన వారిది త్యాగ‌మెలా అవుతుంద‌ని ప్ర‌శ్న‌
ఏపీకి ఏకైక రాజ‌ధానిగా అమ‌రావ‌తిని కొన‌సాగించాలన్న డిమాండ్‌తో రాజ‌ధాని నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతులపై ఏపీ విద్యా శాఖ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ సోమ‌వారం మ‌రోమారు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అమ‌రావ‌తి ప‌రిర‌క్ష‌ణ ఉద్య‌మంలో భాగంగా అమ‌రావ‌తి రైతులు చేప‌డుతున్న మ‌హాపాద‌యాత్ర‌పై నేడు మంత్రి స్పందిస్తూ, యాత్ర‌ను ఎలా అడ్డుకుంటామో చూస్తారా? అంటూ మీడియా ప్ర‌తినిధుల ఎదుట వ్యాఖ్యానించారు. 

తాము క‌న్నెర్ర‌జేస్తే యాత్ర‌లు ఆగిపోతాయ‌ని.. తాము త‌ల‌చుకుంటే అమ‌రావ‌తి రైతుల యాత్ర‌ 5 నిమిషాల్లో ఆగిపోతుందంటూ తాను చేసిన వ్యాఖ్య‌ల‌కు ఇప్ప‌టికీ క‌ట్టుబ‌డి ఉన్నాన‌ని ఆయ‌న అన్నారు.

ఈ సంద‌ర్భంగా అమ‌రావ‌తి నిర్మాణం కోసం పంట భూముల‌ను ఇచ్చిన రైతుల‌ది త్యాగం కాదా? అన్న ప్ర‌శ్న‌కు స్పందిస్తూ‌... అమ‌రావ‌తి రైతుల‌ది త్యాగం ఎలా అవుతుంద‌ని ప్ర‌శ్నించారు. రాజ‌ధాని నిర్మాణం కోసం రైతులు భూములు ఇస్తే... వారికి ప్ర‌భుత్వం నుంచి ప్ర‌యోజ‌నాలు అందాయి క‌దా? అంటూ బొత్స వ్యాఖ్యానించారు. 

పోల‌వ‌రం, నాగార్జున సాగ‌ర్ ప్రాజెక్టుల‌కు భూములు ఇచ్చిన రైతుల‌ది త్యాగ‌మ‌ని ఆయ‌న అన్నారు. త‌మ ప్రాంతంలో అభివృద్ధి జ‌ర‌గాల‌ని కోరితే త‌ప్పేమీ లేద‌ని, అయితే మ‌రో ప్రాంతం అభివృద్ధిని అడ్డుకుంటే మాత్రం చూస్తూ ఊరుకోవాలా? అని ఆయ‌న ప్ర‌శ్నించారు.


More Telugu News