ఉగ్రవాదంపై పోరుకు ఎఫ్-16 యుద్ధ విమానాలా...? ఎవరిని మోసం చేద్దామనుకుంటున్నారు?: అమెరికా-పాక్ సంబంధాలపై జైశంకర్ అసంతృప్తి

  • పాకిస్థాన్ కు గతంలో ఎఫ్-16లు ఇచ్చిన అమెరికా
  • వాటి నిర్వహణ కోసం తాజాగా 450 మిలియన్ డాలర్ల ఒప్పందం
  • ఉగ్రవాదంపై పోరు కోసమేనని అమెరికా వెల్లడి
  • అమెరికా నిర్ణయాన్ని ఇప్పటికే తప్పుబట్టిన భారత్
పాకిస్థాన్ కు గతంలో తాము ఇచ్చిన ఎఫ్-16 యుద్ధ విమానాల నిర్వహణ కోసం అమెరికా ఇటీవల కొత్త ఒప్పందాన్ని తెరపైకి తెచ్చింది. 450 మిలియన్ డాలర్ల విలువైన ఎఫ్-16 విమానాల విడిభాగాలను సరఫరా చేయాలని బైడెన్ సర్కారు నిర్ణయించింది. ఉగ్రవాదంపై పోరు కోసమేనంటూ అమెరికా తన నిర్ణయాన్ని సమర్థించుకుంది. 

ఈ ఒప్పందంపై భారత్ ఇప్పటికే అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఇదే అంశంపై భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జై శంకర్ మరోసారి ఘాటుగా స్పందించారు. అమెరికా-పాకిస్థాన్ సంబంధాల వెనకున్న ప్రాతిపదిక ఏమిటన్నదానిపై ప్రశ్నలు తలెత్తుతున్నాయని అన్నారు. ఈ రెండు దేశాల ప్రభుత్వాల మధ్య కొనసాగుతున్న సంబంధాలు అమెరికా స్ఫూర్తిని ప్రతిబింబించేలా లేవని జై శంకర్ స్పష్టం చేశారు. వాషింగ్టన్ లో భారతీయ అమెరికన్ల సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 

"ఈ ఒప్పందం ఉగ్రవాద వ్యతిరేక చర్యలకు సంబంధించినదని అంటున్నారు. యుద్ధ రంగంలో ఎఫ్-16 పోరాట విమానం సామర్థ్యాలు అందరికీ తెలుసు. కానీ, అలాంటి విమానాలను ఎక్కడ మోహరిస్తున్నారు? ఎలా ఉపయోగిస్తున్నారు? ఉగ్రవాదంపై పోరు కోసమే ఎఫ్-16 యుద్ధ విమానాలు అని చెప్పి ఎవరినీ మోసం చేయలేరు. అమెరికా ప్రభుత్వ పెద్దలతో ఎవరితోనైనా నేను మాట్లాడడం జరిగితే... మీరేం చేస్తున్నారో మీకు తెలుస్తోందా అని కచ్చితంగా అడుగుతాను" అని జైశంకర్ స్పష్టం చేశారు.


More Telugu News