గెహ్లాట్ తీరుపై కాంగ్రెస్ అధిష్ఠానం అసంతృప్తి!

  • ఆయ‌న వ‌ర్గం ఎమ్మెల్యేల‌కు షోకాజ్ నోటీసులు పంపే అవ‌కాశం
  • ఎమ్మెల్యేల రాజీనామా వెనుక ఆయ‌న హ‌స్తం ఉంద‌ని భావిస్తున్న అధిష్ఠానం  
  • తాజా ప‌రిణామాల‌పై బాధ ప‌డుతున్న‌ సీఎం గెహ్లాట్
రాజస్థాన్‌లోని అధికార కాంగ్రెస్ పార్టీలో సంక్షోభం కొత్త మ‌లుపు తిరుగుతోంది. రాష్ట్రంలో నెల‌కొన్న‌ పరిస్థితికి సీఎం అశోక్ గెహ్లాట్ కార‌ణ‌మ‌ని పార్టీ అధిష్ఠానం భావిస్తోంది. ఆయ‌న తీరుతో క‌ల‌త చెందిందని పార్టీ వర్గాలు తెలిపాయి. రాజస్థాన్‌లో ప్రతి నిర్ణయం గెహ్లాట్‌ను సంప్రదించిన తర్వాతే తీసుకున్నా, ఆదివారం రాత్రి  92 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయ‌డం వెనుక ఆయ‌న హ‌స్తం ఉంద‌ని పార్టీ పెద్ద‌లు భావిస్తున్నారు. 

అయితే, ఈ విష‌యంలో తన ప్ర‌మేయం ఏమీ లేదని గెహ్లాట్ ధ్రువీకరించినప్పటికీ, ఆయన ఆదేశాల మేరకే ఎమ్మెల్యేలు రాజీనామా చేసినట్లు  హైకమాండ్ భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. పార్టీ అధ్యక్షుడి కంటే ముఖ్యమంత్రి పదవి పెద్దదని అశోక్ గెహ్లాట్ చుట్టూ ఉన్న వ్యక్తులు ఆయనను ఒప్పించారని పార్టీ హైకమాండ్ భావిస్తోంది.

ఈ క్ర‌మంలో ఎమ్మెల్యేలు మహేశ్ జోషి, శాంతి ధరివాల్‌లకు కాంగ్రెస్ షోకాజ్ నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. పార్టీ వ్యతిరేక చర్యలకు ఎందుకు పాల్పడ్డారని, శాసనసభ సమావేశానికి సీనియర్‌ నేతలు పిలిచినప్పుడు ఆదివారం రాత్రి మ‌రో సమావేశం ఎందుకు నిర్వహించారని నేతలను ప్రశ్నించనుంది. 

మ‌రోవైపు రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఇటీవలి పరిణామాలతో చాలా బాధపడ్డారని ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. అంతేకాకుండా, పార్టీ అధిష్ఠానం సీఎం పదవికి ఎవరిని ఎంపిక చేసినా తాను అంగీక‌రిస్తాన‌ని గెహ్లాట్ ఆగస్టులో రాహుల్ గాంధీకి తెలియజేసినట్లు కూడా వెల్లడైంది. గెహ్లాట్‌కు పార్టీ నాయకత్వంపై ఎంతో గౌరవం ఉందని, అధిష్ఠానాన్ని కించపరచాలని ఎప్పుడూ ఆలోచించరని ఆయ‌న స‌న్నిహిత వ‌ర్గాలు తెలిపాయి.


More Telugu News