టాటా గ్రూప్ కొత్త పాలసీ.. తగ్గిపోనున్న లిస్టెడ్ కంపెనీలు

  • టాటా స్టీల్ లో ఏడు మెటల్ కంపెనీల విలీనం
  • గ్రూపు పరిధిలో 29 లిస్టెడ్ సంస్థలు
  • వీటిని 15కు తగ్గించాలన్న ప్రణాళిక
  • నిర్వహణ సామర్థ్యాలు మెరుగుపడతాయన్న యోచన
‘మంది ఎక్కువైతే మజ్జిగ పలుచన’ ఈ సామెత వినే ఉంటారు. అలాగే, ఒకే వ్యక్తి లేదా గ్రూపు నిర్వహణలో ఒకటికి మించి ఎక్కువ కంపెనీలు ఉంటే ఫోకస్ కొంచెం పలుచన పడుతుంది. వ్యయాలు పెరిగిపోతాయి. అందుకే టాటా గ్రూపు ఇప్పుడు ‘తక్కువ కంపెనీలు -  ఎక్కువ ప్రయోజనం’ అన్న సూత్రాన్ని ఆచరిస్తోంది. టాటా గ్రూపు నుంచి స్టాక్ ఎక్సేంజ్ లలో 29 లిస్టెడ్ కంపెనీలు ఉన్నాయి. దీనివల్ల గ్రూపు పరిధిలో వ్యయాలు ఎక్కువగా ఉంటున్నాయి. ఇది లాభాలపై పడుతోంది. దీంతో చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ గ్రూపు కంపెనీల మధ్య స్థిరీకరణ కసరత్తు చేపట్టారు.

తాజాగా టాటా స్టీల్ లో నాలుగు లిస్టెడ్ మెటల్ కంపెనీలు సహా మొత్తం ఏడు కంపెనీలను విలీనం చేయాలని నిర్ణయించారు. టాటా గ్రూపు పరిధిలో ఐదు డజన్ల వరకు అన్ లిస్టెడ్ కంపెనీలు కూడా ఉన్నాయి. ఇక వీటి అనుబంధ కంపెనీలను కూడా కలిపి చూస్తే వందల సంఖ్యలో ఉంటాయి. ముఖ్యంగా చిన్న కంపెనీలను అదే తరహా వ్యాపారం కలిగిన కంపెనీలతో విలీనం చేయాలన్న విధానంతో టాటా గ్రూపు (టాటా సన్స్) ఉంది. ఇందులో భాగంగానే టాటా కాఫీని టాటా కన్జ్యూమర్ లో విలీనం చేయనున్నారు. పలు రంగాల్లో ఒకటికి మించిన కంపెనీలు కూడా ఉన్నాయి. 

మొత్తం 29 లిస్టెడ్ కంపెనీలను విలీనాలతో 15కు తగ్గించాలన్నది ప్రణాళిక. దీనివల్ల కంపెనీలు పెద్దవిగా మారతాయి. కొన్ని కంపెనీలే ఉండడం వల్ల వ్యాపార వృద్ధి, విస్తరణపై మరింత దృష్టి పెట్టడం వీలు పడుతుందని గ్రూపు భావిస్తోంది. నగదు ప్రవాహాలు కూడా మెరుగుపడతాయి. పోటీతత్వం, సామర్థ్యాలు ఇనుమడిస్తాయి. చిన్న కంపెనీల నిర్వహణకు వెచ్చిస్తున్న విలువైన సమయాన్ని పెద్ద కంపెనీలకు కేటాయించొచ్చు. టాటా గ్రూపు ఆదాయం 128 బిలియన్ డాలర్లుగా ఉంటే, మార్కెట్ విలువ 255 బిలియన్ డాలర్లుగా ఉంది.


More Telugu News