ఇన్ స్టా గ్రామ్ లో ఇప్పుడు పెద్ద సైజు వీడియోలు కూడా..!

  • 60 సెకన్ల వరకు ఒక్కటే వీడియోగా పోస్ట్ చేయడానికి వీలు
  • ప్రస్తుతం పెద్ద సైజువి పోస్ట్ చేస్తే 15 సెకన్ల క్లిప్ లుగా విభజన
  • త్వరలో అప్ డేట్ ద్వారా అమల్లోకి నూతన ఫీచర్
ప్రముఖ సామాజిక మాధ్యమ వేదిక ‘ఇన్ స్టా గ్రామ్’ యూజర్లకు త్వరలో కొత్త ఫీచర్ అందుబాటులోకి రానుంది. ఇన్ స్టా గ్రామ్ స్టోరీస్ లో ప్రస్తుతం పెద్ద సైజు వీడియోలను పోస్ట్ చేసే అవకాశం లేదు. పోస్ట్ చేస్తే, దాన్ని 15 సెకన్ల నిడివిగల చిన్నపాటి వీడియో క్లిప్ లుగా సాఫ్ట్ వేర్ విడగొడుతోంది. ఇకపై ఈ ఇబ్బంది ఉండదు. 60 సెకన్లు, అంటే ఒక నిమిషం వరకు నిడివి ఉన్న వీడియో ఒక్కటిగానే పోస్ట్ అవుతుంది. చిన్న చిన్న క్లిప్ లుగా విడిపోవడం ఉండదు.

ఈ విషయాన్ని మెటా (మాతృ సంస్థ) కూడా ధ్రువీకరించినట్లు ‘టెక్ క్రంచ్’ అనే పోర్టల్ విశ్వసనీయ సమాచారాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది. టిక్ టాక్ కు గట్టి పోటీ నిచ్చేందుకు ఇన్ స్టా గ్రామ్ ఈ ఫీచర్ ను మార్చినట్టు తెలుస్తోంది. ఇన్ స్టా గ్రామ్ స్టోరీస్ లో ఎక్కువగా వీడియోలను పోస్ట్ చేసే వారికి ఈ ఫీచర్ ఎంతో ఉపయోగపడనుంది. త్వరలోనే అప్ డేట్ ద్వారా ఈ ఫీచర్ అందుబాటులోకి రానుందన్నది తాజా సమాచారం.


More Telugu News