అటార్నీ జ‌న‌ర‌ల్ ప‌ద‌వి వ‌ద్దంటున్న సుప్రీం సీనియ‌ర్ న్యాయ‌వాది

  • కేంద్ర ప్ర‌భుత్వ ఆఫ‌ర్ ను తిర‌స్క‌రించిన ముకుల్ రోహ‌త్గీ
  • ఈ నెల 30వ తేదీతో ముగియ‌నున్న ప్ర‌స్తుత అటార్నీ జ‌న‌ర‌ల్ వేణుగోపాల్ ప‌ద‌వి
  • పొడిగింపున‌కు నిరాక‌రిస్తున్న వేణుగోపాల్
న్యాయ‌వాద వృత్తిని చేప‌ట్టిన వారికి ప్ర‌భుత్వంలో అటార్నీ జ‌న‌ర‌ల్ ప‌ద‌వి వ‌స్తుందంటే చాలా సంతోషిస్తారు. పైగా ఎంతో ప్రాముఖ్య‌త ఉండే భార‌త‌ ప్ర‌భుత్వ అటార్నీ జ‌న‌ర‌ల్ ప‌ద‌వి కోసం చాలామంది పోటీ ప‌డుతుంటారు. కానీ, సుప్రీంకోర్టు సీనియ‌ర్ న్యాయ‌వాది ముకుల్ రోహ‌త్గీ మాత్రం ఇందుకు భిన్నంగా ఉన్నారు. కేంద్ర ప్ర‌భుత్వం ఆఫ‌ర్ చేసిన అటార్నీ జ‌న‌ర‌ల్ ప‌ద‌విని ఆయ‌న తిర‌స్క‌రించి ఆశ్చ‌ర్య‌ప‌రిచారు. ఈ విష‌యాన్ని ఆయ‌నే వెల్ల‌డించారు. త‌న నిర్ణ‌యం వెనుక నిర్దిష్ట కార‌ణం ఏమీ లేద‌ని స్ప‌ష్టం చేశారు. మ‌రోవైపు అటార్నీ జ‌న‌ర‌ల్‌గా మ‌రికొంత కాలం కొన‌సాగ‌డానికి కేకే వేణుగోపాల్ సైతం ఇష్టప‌డ‌టం లేదు. ఆయ‌న ప‌ద‌వీకాలం ఈనెల 30వ తేదీతో ముగుస్తుంది. 

ప‌ద‌వీకాలం పొడిగింపున‌కు వేణుగోపాల్ సుముఖంగా లేక‌పోవ‌డంతో కేంద్ర ప్ర‌భుత్వం రోహ‌త్గీకి క‌బురు చేసింది. కానీ, ఆయ‌న సుముఖత వ్యక్తం చేయలేదు. రోహ‌త్గీకి ఇది వ‌ర‌కు  అటార్నీ జ‌న‌ర‌ల్ గా ప‌ని చేసిన అనుభవం ఉంది. 2014-2017 మ‌ధ్య మూడేళ్లు ఈ ప‌ద‌విలో ఉన్నారు. అప్పుడు కూడా కొన‌సాగింపున‌కు ఇష్ట‌ప‌డ‌క‌పోవ‌డంతో ఆయ‌న స్థానంలో కేకే వేణుగోపాల్ ను ప్ర‌భుత్వం అటార్నీ జ‌న‌ర‌ల్ గా నియ‌మించింది. వేణుగోపాల్ మూడేళ్ల కాలం కూడా ముగియ‌నుంది. ఈ నేప‌థ్యంలో త‌దుప‌రి అటార్నీ జ‌న‌ర‌ల్ ఎవ‌రన్న‌దానిపై ఉత్కంఠ మొద‌లైంది.


More Telugu News