పంజాబ్ లో ఆప్ బ‌ల‌నిరూప‌ణ రేపే

  • అసెంబ్లీ స‌మావేశాల‌కు అనుమ‌తి నిచ్చిన గ‌వ‌ర్న‌ర్
  • ఈ నెల 22వ తేదీనే శాస‌న స‌భ ప్ర‌త్యేక స‌మావేశాల‌కు క్యాబినెట్ ఆమోదం
  • నిబంధ‌న‌లు పాటించ‌లేద‌ని తీర్మానానికి ఆమోదం తెలుప‌ని గ‌వ‌ర్న‌ర్
పంజాబ్‌లో ఆప్ ప్ర‌భుత్వం, గ‌వ‌ర్న‌ర్ మ‌ధ్య వివాదం స‌ద్దుమ‌ణిగింది. శాస‌న స‌మావేశాల‌పై గ‌వ‌ర్న‌ర్ బ‌న్వరీలాల్ పురోహిత్ ఎట్ట‌కేల‌కు బెట్టు వీడారు. మంగ‌ళ‌వారం అసెంబ్లీ స‌మావేశాల నిర్వ‌హించ‌డానికి అనుమతి మంజూరు చేశారు. దీంతో ఆప్ ప్ర‌భుత్వం నిరూప‌ణ‌కు సిద్ధ‌మైంది. కేంద్రంలోని బీజేపీ త‌మ ప్ర‌భుత్వాన్ని కూల్చేందుకు ప్ర‌య‌త్నిస్తోంద‌ని ఆప్ కొన్ని రోజులుగా ఆరోపిస్తోంది. త‌మ ఎమ్మెల్యేల‌ను కొనుగోలు చేసేందుకు బేర‌సారాలు చేస్తోంద‌ని ఆక్షేపించింది. 

ఈ నేప‌థ్యంలో త‌న బ‌లాన్ని నిరూపించుకోవడానికి ఆప్ సిద్ధ‌మైంది. వాస్త‌వానికి ఈనెల 22న విశ్వాస ప‌రీక్ష కోసం అసెంబ్లీ ప్ర‌త్యేక స‌మావేశాన్ని ఏర్పాటు చేయాల‌ని గ‌వ‌ర్న‌ర్‌ను కోరింది. ఈ మేర‌కు కాబినెట్ తీర్మానం కూడా చేసింది. కానీ, ఈ తీర్మానంలో నిబంధ‌న‌లు పాటించ‌లేదంటూ గ‌వ‌ర్న‌ర్ అసెంబ్లీ సమావేశాల నిర్వ‌హ‌ణ‌కు ఆమోదం తెలుప‌లేదు. అప్ప‌టి నుంచి గ‌వ‌ర్న‌ర్ తీరుపై అప్ జాతీయ క‌న్వీన‌ర్ అర‌వింద్ కేజ్రివాల్‌, పంజాబ్ సీఎం భ‌గ‌వంత్ సింగ్ మాన్ గ‌వ‌ర్న‌ర్ తీరుపై ఆగ్ర‌హంగా ఉన్నారు. ఈ క్ర‌మంలో శాస‌న స‌భ ప్ర‌త్యేక స‌మావేశంలో చేప‌ట్టాల్సిన అంశాల వివరాల‌ను గ‌వ‌ర్న‌ర్ కు అంద‌జేసింది. దీనికి గ‌వ‌ర్న‌ర్ ఆమోదం తెలుప‌డంతో ఆప్ బ‌ల‌ప‌రీక్ష‌కు సిద్ధ‌మ‌వుతోంది.


More Telugu News