ఏదో చెబుతాడనుకుంటే... ఓరియో బిస్కెట్లు లాంచ్ చేసిన ధోనీ

  • ఆదివారం లైవ్ లోకి వస్తున్నానంటూ నిన్న ధోనీ ప్రకటన
  • అభిమానుల్లో ఆందోళన
  • ఐపీఎల్ కు కూడా రిటైర్మెంట్ ప్రకటిస్తాడేమోనని ఉత్కంఠ
  • వ్యాపార ప్రకటనతో ముందుకొచ్చిన ధోనీ
టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ఆదివారం నాడు ఒక ముఖ్యమైన విషయం అందరితో పంచుకోనున్నానంటూ నిన్న సోషల్ మీడియాలో పోస్టు చేయడం తెలిసిందే. ధోనీ ఐపీఎల్ నుంచి కూడా వీడ్కోలు తీసుకోనున్నాడా? అంటూ అభిమానులు ఆందోళనకు గురయ్యారు. ఇంతకీ ధోనీ ఏంచెప్పనున్నాడంటూ సర్వత్రా ఆసక్తి నెలకొంది. 

అయితే, అందరి ఉత్కంఠను పటాపంచలు చేస్తూ.... ధోనీ సరికొత్త ఓరియో బిస్కెట్లను ఆవిష్కరించాడు. 2011లో భారత్ వరల్డ్ కప్ విజేతగా నిలిచింది ధోనీ కెప్టెన్సీలోనే. ఇప్పుడు టీమిండియా టీ20 వరల్డ్ కప్-2022కు సిద్ధమవుతోంది. 

ఈ నేపథ్యంలో బ్రింగ్ బ్యాక్ 2011 పేరిట ఓరియో ప్రచార కార్యక్రమం చేపట్టింది. అందులో భాగంగానే క్యాడ్బరీ సంస్థ ఓరియో స్పెషల్ బిస్కెట్లను తీసుకువచ్చింది. వీటిపై ధోనీ బొమ్మను, ఎంఎస్ డీ అనే అక్షరాలను, ధోనీ జెర్సీ నెం.7ను ముద్రించడం విశేషం. 

దీనిపై ధోనీ మాట్లాడుతూ, ఓరియో బిస్కెట్లు తొలిసారిగా భారత్ లోకి వచ్చింది 2011లో అని వెల్లడించారు. ఆ ఏడాది భారత్ వరల్డ్ కప్ నెగ్గిందని తెలిపారు. ఇప్పుడు 2022లో ఓరియో మళ్లీ లాంచ్ అవుతోందని, ఈ ఏడాది కూడా ఓ కప్ జరగనుందని, మరి విజేత ఇంకెవ్వరు? టీమిండియానే అంటూ హుషారెక్కించాలా వివరణ ఇచ్చారు. 

కాగా ధోనీ లైవ్ లోకి వస్తున్నానని చెప్పి ఓరియో బిస్కెట్లు లాంచ్ చేయడంపై నెటిజన్లు సోషల్ మీడియాలో మీమ్స్ తో రెచ్చిపోతున్నారు.


More Telugu News