ఉద్రిక్తతలను మళ్లీ రాజేసిన ఉత్తరకొరియా.. స్వల్ప శ్రేణి బాలిస్టిక్ మిసైల్ ప్రయోగం

  • ఈ ఉదయం 7 గంటలకు క్షిపణి ప్రయోగం
  • 60 కిలోమీటర్ల ఎత్తులో ప్రయాణించి 600 కిలోమీటర్ల దూరంలో పడిన క్షిపణి
  • ఇది కచ్చితంగా రెచ్చగొట్టే చర్యేనన్న దక్షిణ కొరియా
  • క్షిపణి పరీక్షకు నిర్ధారించిన జపాన్ కోస్ట్ గార్డ్
అమెరికాను రెచ్చగొట్టడంలో ముందుండే ఉత్తర కొరియా మరోమారు అలాంటి పనే చేసింది. ఈ ఉదయం 7 గంటల సమయంలో స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించి ఉద్రిక్తతలు రాజేసింది. టైకాన్ అనే ప్రదేశం నుంచి ఈ క్షిపణి ప్రయోగం జరిగినట్టు దక్షిణ కొరియా పేర్కొంది. 60 కిలోమీటర్ల ఎత్తులో ప్రయాణించిన ఈ క్షిపణి 600 కిలోమీటర్ల దూరంలో పడింది. దక్షిణ కొరియాతో కలిసి సంయుక్త విన్యాసాలకు అమెరికా రెడీ కావడం, ఇంకొన్ని రోజుల్లో అమెరికా ఉపాధ్యక్షురాలు దక్షిణ కొరియాను సందర్శించనున్న నేపథ్యంలో ఉత్తర కొరియా ఈ క్షిపణిని ప్రయోగించడం ఉద్రిక్తతలకు దారితీసింది.

ఈ క్షిపణి పరీక్షపై దక్షిణ కొరియా తీవ్రంగా స్పందించింది. ఇది కచ్చితంగా కవ్వింపు చర్యేనని పేర్కొంది. తాము కూడా సిద్ధంగా ఉన్నామని ప్రకటించింది. అమెరికాతో కలిసి రక్షణ సహకారాన్ని మరింత బలోపేతం చేసుకుంటామని స్పష్టం చేసింది. ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగాన్ని జపాన్ కోస్టు గార్డు కూడా ధ్రువీకరించింది. కాగా, ఇటీవల ఉత్తర కొరియా తనను తాను అణ్వస్త్ర దేశంగా ప్రకటించుకుంది. ఐక్యరాజ్య సమితి ఆంక్షలను సైతం తోసిరాజని 2006 నుంచి 2017 వరకు ఉత్తరకొరియా ఆరుసార్లు అణ్వాయుధాలను పరీక్షించింది.


More Telugu News