అరుణాచల్ ప్రదేశ్‌లో ఫ్లాష్ ఫ్లడ్స్.. కారు ఎలా కొట్టుకుపోయిందో చూడండి!

  • అసోంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలు
  • చిపుత గ్రామంలో ఫ్లాష్ ఫ్లడ్స్
  • చూస్తుండగానే కొట్టుకుపోయిన కారు
  • గురుగ్రామ్‌లో నీటిలో మునిగిన రాజీవ్ చౌక్ అండర్ పాస్
  • ఉత్తరాఖండ్‌లో చిక్కుకుపోయిన 40 మంది యాత్రికులు
అసోంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు కొండచరియలు విరిగిపడుతున్నాయి. అకస్మాత్తుగా సంభవిస్తున్న వరదలు ప్రాణాలను హరిస్తున్నాయి. తాజాగా సుబన్‌సిరి జిల్లాలోని ఓ కొండప్రాంతంలోని రోడ్డులో సంభవించిన ఫ్లాష్ ఫ్లడ్స్‌కు ఓ కారు కొట్టుకుపోయిన వీడియో సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది. రోడ్డుపై నుంచి జోరుగా పారుతున్న వరద నీటిని దాటుకుంటూ నెమ్మదిగా అటువైపు వెళ్తున్న స్కార్పియో వాహనం ఒక్కసారిగా అదుపుతప్పి కిందనున్న లోయలో పడిపోయింది. చిపుత గ్రామంలో సంభవించిన ఫ్లాష్‌ఫ్లడ్స్ కారణంగా ఈ ఘటన జరిగినట్టు వీడియోను షేర్ చేసిన ‘ఏఎన్ఐ’ వార్తా సంస్థ పేర్కొంది. 

గత కొన్ని రోజులుగా ఈ ఈశాన్యరాష్ట్రంలో విస్తారంగా వానలు పడుతున్నాయి. నేడు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ ఆరెంజ్ హెచ్చరిక జారీ చేసింది. మరోవైపు, కుండపోత వానలతో దేశంలోని పలు ప్రాంతాలు అల్లాడిపోతున్నాయి. ఢిల్లీ-ఎన్‌సీఆర్ పరిధిలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జనజీవనం అస్తవ్యస్తమైంది. నిన్న కురిసిన వర్షానికి రోడ్లన్నీ మోకాలి లోతు నీరుతో చెరువులను తలపించాయి. 

గురుగ్రామ్‌లోని రాజీవ్ చౌక్ అండర్‌పాస్ పూర్తిగా మునిగిపోయింది. పలు చోట్ల వృక్షాలు కూలి రవాణాకు అంతరాయం కలిగించాయి. ఉత్తరాఖండ్‌లోనూ గత కొన్ని రోజులుగా ఇలాంటి పరిస్థితే ఉంది. భారీ వర్షం కారణంగా పెద్ద కొండచరియ విరిగి పడింది. నజంగ్ తంబ గ్రామం సమీపంలో జాతీయ రహదారిపై కొండచరియలు విరిగిపడడంతో రహదారిని మూసేశారు. దీంతో తవాఘాట్ వద్ద 40 మంది యాత్రికులు చిక్కుకుపోయారు.


More Telugu News