రేణిగుంటలో ఘోర అగ్నిప్రమాదం: వైద్యుడి సహా ముగ్గురి మృతి

  • కార్తికేయ పేరుతో ఆసుపత్రి నిర్వహిస్తున్న రవిశంకర్‌రెడ్డి
  • భవనంపైనే నివసిస్తున్న వైద్యుడి కుటుంబం
  • ఈ ఉదయం ఒక్కసారిగా చెలరేగిన మంటలు
  • వైద్యుడి భార్య, అత్తను రక్షించిన స్థానికులు
  • ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన వైద్యుడి కుమార్తె, కుమారుడు
తిరుపతి జిల్లా రేణిగుంటలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో ఓ వైద్యుడి కుటుంబం మృతి చెందింది. ప్రమాదంలో వైద్యుడు అక్కడే సజీవ దహనం కాగా, ఆయన కుమార్తె, కుమారుడు చికిత్స పొందుతూ మృతి చెందారు. రేణిగుంటలోని భగత్‌సింగ్ కాలనీలో కార్తీకేయ పేరుతో డాక్టర్ రవిశంకర్ రెడ్డి ఆసుపత్రి నిర్వహిస్తున్నారు. అదే ఆసుపత్రి భవనం పైన రవిశంకర్‌రెడ్డి కుటుంబం ఉంటోంది. ఈ ఉదయం వైద్యుడి కుటుంబం నివాసం ఉంటున్న అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

గమనించిన స్థానికులు పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇస్తూనే మంటల్లో చిక్కుకున్న రవిశంకర్‌రెడ్డి భార్య, అత్తను కాపాడారు. అప్పటికే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసి అతి కష్టం మీద రవిశంకర్‌రెడ్డి 12 ఏళ్ల కుమారుడు భరత్, కుమార్తె కార్తీక (15)లను రక్షించి కిందికి దించారు. 

అనంతరం వారిని తిరుపతిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ వారిద్దరూ మృతి చెందారు. రవిశంకర్‌రెడ్డి మాత్రం మంటల్లో చిక్కుకుని సజీవ దహనమయ్యారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్టు ప్రాథమిక నిర్ధారణకు వచ్చిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


More Telugu News