చైనాలో సైన్యం తిరుగుబాటు.. అధ్యక్షుడు జిన్ పింగ్ గృహనిర్బంధం?

  • బీజింగ్ చుట్టూ మోహరించిన సైన్యం
  • మూడోసారి కూడా అధ్యక్షుడిగా కొనసాగాలన్న నిర్ణయంతోనే గృహ నిర్బంధం
  • కొత్త అధ్యక్షుడిగా సైనికాధికారి లీ కియావోమింగ్
  • బీజింగ్‌తో తెగిపోయిన సంబంధాలు
  • చైనాలో ఏం జరుగుతోందనన్న ఉత్కంఠ
  • అధికారికంగా నిర్ధారణ కాని వార్తలు
చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌పై వస్తున్న వార్తలు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. సైన్యం తిరుగుబాటు చేసిందని, జిన్‌పింగ్‌ను గృహ నిర్బంధంలో ఉంచిందని నిన్న ఒక్కసారిగా వార్తలు గుప్పుమన్నాయి. అయితే, ప్రముఖ మీడియా సంస్థలు మాత్రం ఇందుకు సంబంధించి ఎలాంటి వార్తలు ప్రకటించలేదు. చైనా మీడియా సంస్థలు కూడా దీనిపై స్పందించలేదు. కాకపోతే కొన్ని వీడియోలు మాత్రం సైనిక చర్యను నిర్ధారించేలా ఉన్నాయి.

బీజింగ్‌ చుట్టూ సైన్యం
రాజధాని బీజింగ్ చుట్టూ సైన్యం మోహరించినట్టుగా ఉండడం ఈ వార్తలకు ఊతమిస్తోంది. అలాగే, 80 కిలోమీటర్ల పొడవైన సైనిక కాన్వాయ్ బీజింగ్ దిశగా వెళ్తున్నట్టు కూడా కొన్ని వీడియోలను బట్టి తెలుస్తోంది. అంతేకాదు, అధ్యక్షుడు జిన్‌పింగ్‌ను గృహ నిర్బంధంలో ఉంచిన సైన్యం అధికారాన్ని హస్తగతం చేసుకుందని, సైనికాధికారి లీ కియావోమింగ్ నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు కూడా చేపట్టినట్టు వార్తలు వచ్చాయి.

బీజింగ్‌తో తెగిపోయిన సంబంధాలు

ప్రస్తుతం బీజింగ్‌కు ఇతర దేశాలతో సంబంధాలు తెగిపోయాయని, అంతర్జాతీయ విమానాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. చైనా మాజీ అధ్యక్షుడు హు జింటావో, మాజీ ప్రధాని వెన్ జియాబావో కలిసి ‘సెంట్రల్ గార్డ్ బ్యూరో’ (సీజీబీ) పగ్గాలు చేపట్టాల్సిందిగా స్థాయి సంఘం మాజీ సభ్యుడు సాంగ్ పింగ్‌ను ఆదేశించారన్న మరో వార్త కూడా ప్రచారంలో ఉంది.

సమర్‌కండ్ నుంచి రాగానే నిర్బంధంలోకి
ఉజ్బెకిస్థాన్‌లోని సమర్‌కండ్‌లో ఇటీవల జరిగిన షాంఘై సహకరా సంస్థ (ఎస్‌సీవో) సదస్సులో పాల్గొన్న జిన్‌పింగ్ తిరిగి స్వదేశానికి రాగానే సైన్యం నిర్బంధంలోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. అధ్యక్షుడి భద్రత ఏర్పాట్లను చూసే సీజీబీయే గత పది రోజుల్లో రహస్యంగా సమావేశమయ్యారని, అధికారాన్ని హస్తగతం చేసుకోవడమే లక్ష్యంగా ఈ సమావేశం జరిగిందని కూడా చెబుతున్నారు. వరుసగా మూడోసారి కూడా జిన్‌పింగ్ అధ్యక్షుడిగా కొనసాగాలని భావిస్తుండడమే ఈ సైనిక చర్యకు కారణమని తెలుస్తోంది. అంతేకాదు, జిన్‌పింగ్ సమర్‌కండ్‌లో ఉన్నప్పుడే కుట్ర జరిగినట్టు కూడా వార్తలు వినిపిస్తున్నాయి.

అవినీతిని సహించకపోవడమే కారణం?
2012లో జిన్‌పింగ్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అవినీతికి వ్యతిరేకంగా బలంగా గళం వినిపిస్తున్నారు. ఈ క్రమంలో అవినీతి ఆరోపణలపై పలువురు అధికారులు, రాజకీయ నేతలకు కఠిన శిక్షలు అమలు చేస్తున్నారు. అవినీతి, అధికార దుర్వినియోగం ఆరోపణలపై ఇటీవల ఇద్దరు మాజీ మంత్రులకు, మరో మాజీ ఉన్నతాధికారికి మరణశిక్షలు విధించారు. మరో నలుగురు అధికారులకు యావజ్జీవ శిక్షలు విధించారు. జిన్‌పింగ్‌పై సైనిక చర్యకు ఇది కూడా ఓ కారణమని చెబుతున్నారు. ఈ వార్తలపై నేడు ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.


More Telugu News