మన్మోహన్​ మంచి ఆర్థికవేత్త.. అయినా ఆర్థిక ప్రగతి నిలిచిపోయింది: ఇన్ఫోసిస్​ నారాయణమూర్తి

  • ఆ రోజుల్లో అంతర్జాతీయంగా ఎక్కువగా చైనా పేరే వినిపించేదన్న నారాయణమూర్తి
  • ఎందుకో తెలియకుండానే అలా జరిగిందని వ్యాఖ్య
  • ప్రస్తుతం ప్రపంచ వాణిజ్యంలో భారత్ కు ఆశలు చిగురించాయని వెల్లడి
కేంద్రంలో మన్మోహన్ సింగ్ ప్రధానిగా యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు దేశ ఆర్థిక ప్రగతి నిలిచిపోయిందని ప్రముఖ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి వ్యాఖ్యానించారు. నిజానికి అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ అసాధారణమైన వ్యక్తి అని, మంచి ఆర్థిక వేత్త అని.. అయినా ఏవో కొన్ని కారణాలతో దేశ ఆర్థిక ప్రగతి వెనుకబడిందని పేర్కొన్నారు. అహ్మదాబాద్ ఐఐఎం విద్యార్థులు, పారిశ్రామికవేత్తలతో జరిగిన సమావేశంలో ప్రసంగిస్తూ నారాయణమూర్తి యూపీఏ ప్రభుత్వ హయాంపై వ్యాఖ్యలు చేశారు.

అప్పట్లో చైనా పేరే వినిపించేది
మన్మోహన్‌ సింగ్‌ ప్రధానిగా ఉన్న సమయంలో అంతర్జాతీయ సమావేశాల్లో చైనా పేరు ఎక్కువ సార్లు వినిపించేదని.. భారత దేశం పేరు చాలా అరుదుగా వినిపించేదని నారాయణ మూర్తి పేర్కొన్నారు. ఆనాడు మన్మోహన్ హయాంలో ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకోలేదని.. దేశంలో ఆర్థిక కార్యకలాపాలు స్తంభించి పోయాయని చెప్పారు. ఇప్పుడున్న పరిస్థితులలో ప్రపంచ వాణిజ్యంలో భారత దేశానికి ఆశలు చిగురించాయని చెప్పారు. భారత దేశ యువత మన దేశాన్ని చైనాకు తగిన పోటీగా మార్చగలదని ధీమా వ్యక్తం చేశారు.


More Telugu News