చివరి మ్యాచ్ ఆడి.. ప్రొఫెషనల్ టెన్నిస్‌కు ఫెదరర్ ఘన వీడ్కోలు: ‘పర్ఫెక్ట్ జర్నీ’ అన్న స్విస్ దిగ్గజం

  • చిరకాల ప్రత్యర్థి నాదల్‌తో కలిసి డబుల్స్ ఆడిన ఫెదరర్
  • ఓడినా చిన్నబోయిన ఫలితం
  • మైదానంలో భావోద్వేగంతో కన్నీరు పెట్టుకున్న అభిమానులు
  • కరతాళ ధ్వనులతో వీడ్కోలు
  • మ్యాచ్‌కు హాజరైన ఫెదరర్ భార్య, పిల్లలు, తల్లిదండ్రులు
స్విస్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ చివరి ఆట ఆడి, టెన్నిస్‌కు వీడ్కోలు చెప్పేశాడు. ఏటీపీ టూర్ మ్యాచ్‌లో భాగంగా గత రాత్రి లావెర్ కప్ ఫైనల్ మ్యాచ్ ఆడిన అనంతరం ప్రొఫెషనల్ టెన్నిస్‌కు గుడ్ బై చెప్పేశాడు. ఈ సందర్భంగా తన కెరియర్‌ను ‘పర్ఫెక్ట్ జర్నీ’గా అభివర్ణించాడు.

లండన్‌లోని 02 ఎరీనాలో జరిగిన డబుల్స్ ఈవెంట్‌లో తన చిరకాల ప్రత్యర్థి రఫెల్ నాదల్‌తో కలిసి బరిలోకి దిగాడు. ‘ఫెడల్’గా పిలిచే ఈ జంట ఈ మ్యాచ్‌లో యూరప్‌కు ప్రాతినిధ్యం వహించింది. టీమ్ వరల్డ్‌కు చెందిన జాక్ సోక్- ఫ్రాన్సిస్ టియాఫో జంటతో జరిగిన ఈ మ్యాచ్‌లో ఫెదరర్ జంట 6-4, 6(2)-7, 9-11తో ఓటమి పాలైంది. 

టెన్నిస్‌కు సేవలందించిన దిగ్గజ ఆటగాళ్లలో ఒకరికి సంబంధించిన గొప్ప మ్యాచ్ కావడంతో ఫలితం కూడా చిన్నబోయింది. ఫెదరర్‌కు ఇది అద్భుతమైన రోజుగా మిగిలిపోనుంది. అనంతరం జరిగిన ‘ఆన్-కోర్ట్’ ఇంటర్వ్యూలో ఫెదరర్ మాట్లాడుతూ.. తన కెరియర్‌ను ‘పర్ఫెక్ట్ జర్నీ’గా అభివర్ణించాడు. రిటైర్మెంట్ వల్ల తానేమీ విచారంగా లేనని, చాలా సంతోషంగా ఉన్నానని చెప్పుకొచ్చాడు. ఇక్కడుండడాన్ని చాలా గొప్పగా భావిస్తున్నట్టు చెప్పాడు. రఫెల్ నాదల్‌తో కలిసి ఆడడం, రాకెట్ (రాడ్ లావెర్), ఎడ్‌బర్గ్, స్టెఫాన్ వంటి దిగ్గజాలు ఉండడం మధుర జ్ఞాపకమని అన్నాడు. వారికి ధన్యవాదాలు తెలిపాడు.  

మ్యాచ్ అనంతరం నాదల్, ప్రత్యర్థులు సోక్, టియాఫోను ఫెదరర్ ఆలింగనం చేసుకుంటున్నప్పుడు కోర్టులో ఒక్కసారిగా భావోద్వేగ వాతావరణం నిండుకుంది. ప్రతి ఒక్కరు కన్నీరు పెట్టుకున్నారు. స్టాండ్స్‌లో నిలబడి ఫెదరర్‌కు కరతాళ ధ్వనులతో వీడ్కోలు పలికారు. ఈ మ్యాచ్‌‌కు ఫెదరర్ భార్య మిర్కా, అతడి నలుగురి పిల్లలు, తల్లిదండ్రులు హాజరయ్యారు. ఫెదరర్ సహచరులు, ప్రత్యర్థులు అతడిని ఎత్తుకుని మైదానంలో కలియదిరిగారు. కెరియర్‌లో 20 గ్రాండ్ స్లామ్‌లు గెలుచుకున్న ఫెదరర్ ప్రొఫెషనల్ క్రికెట్‌కు గతవారమే వీడ్కోలు ప్రకటించాడు.


More Telugu News