ఇంకెంత కాలం ఈ నిరంకుశత్వం?: నారా లోకేశ్

  • జర్నలిస్టులు అంకబాబు, వంశీకృష్ణ అరెస్ట్ లను ఖండించిన లోకేశ్
  • జర్నలిస్టులకు సంకెళ్లు వేస్తున్నారంటూ మండిపాటు
  • పాత్రికేయులపైనా రాజద్రోహం కేసులు పెడుతున్నారని ఆగ్రహం
ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న ఓ కథనాన్ని షేర్ చేశారన్న ఆరోపణలతో సీనియర్ జర్నలిస్ట్ అంకబాబు అరెస్ట్, అందుకు నిరసనగా ఆందోళనకు దిగిన జర్నలిస్టులను అరెస్ట్ చేసిన తీరుపై టీడీపీ అగ్ర నేత నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ పాలనలో జర్నలిజానికి సంకెళ్లు వేస్తున్నారంటూ మండిపడ్డ లోకేశ్.. పత్రికా స్వేచ్ఛను హరించే విధంగా చీకటి జీవో తీసుకొచ్చారని విమర్శించారు. అంతటితో ఆగని వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు ఏకంగా రాజద్రోహం కేసులు పెట్టి పాత్రికేయులను అరెస్ట్ చేస్తోందని మండిపడ్డారు. ఇంకెంత కాలం ఈ నిరంకుశత్వం అని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. 


వాట్సాప్ లో వార్త పోస్ట్ చేశారని అంకబాబును అరెస్ట్ చేయడమే అన్యాయం అనుకుంటే.. ఆయనకు మద్దతుగా గళం విప్పిన సాటి జర్నలిస్టులను వేధించడం ఇంకా దారుణమని లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంకబాబు అరెస్ట్ ని, పత్రికా స్వేచ్ఛని హరిస్తున్న ప్రభుత్వాన్ని ప్రశ్నించి శాంతియుతంగా నిరసన తెలుపుతున్న మహా టీవీ ఎండి వంశీ తో పాటు పలువురు జర్నలిస్టులను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు లోకేశ్ తెలిపారు. తక్షణమే అరెస్ట్ చేసిన జర్నలిస్టులను విడుదల చెయ్యాలని ఆయన డిమాండ్ చేశారు.


More Telugu News