టికెట్ల విక్రయాల్లో అక్రమాలు జరగలేదు: అజారుద్దీన్

  • హెచ్ సీఏకు, టికెట్ల విక్రయానికి సంబంధం లేదన్న అజార్
  • టికెట్ల విక్రయ బాధ్యతలు పేటీఎంకు అప్పగించామని వెల్లడి
  • టికెట్ల విక్రయంపై దుష్ప్రచారం జరుగుతోందని ఆరోపణ
  • బాధితులందరికీ హెచ్ సీఏ తరఫున వైద్య సేవలు అందిస్తున్నామని వివరణ
టీమిండియా మాజీ కెప్టెన్, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మహ్మద్ అజారుద్దీన్ ఈ నెల 25న జరగనున్న మ్యాచ్ టికెట్ల విక్రయాల వివాదంపై శుక్రవారం పూర్తి వివరాలను వెల్లడించారు. ఈ నెల 25న హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియాల మధ్య మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ టికెట్ల కోసం జింఖానా మైదానానికి భారీగా జనం తరలిరాగా... తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో పలువురికి గాయాలు కాగా... టికెట్లన్నీ అజారుద్దీన్ అమ్మేసుకున్నారంటూ విమర్శలు రేగాయి.


ఈ వివాదంపై వివరణ ఇచ్చేందుకే మీడియా ముందుకు వచ్చిన అజారుద్దీన్ మ్యాచ్ టికెట్ల విక్రయాల్లో ఎలాంటి అక్రమాలు జరగలేదని వెల్లడించారు. టికెట్ల విక్రయాలను పేటీఎంకు అప్పగించామన్నారు. ఆన్ లైన్ లో విక్రయించే టికెట్లను బ్లాక్ లో ఎలా విక్రయిస్తారని ఆయన ప్రశ్నించారు. టికెట్ల విక్రయాలను పేటీఎంకు అప్పగించాక...ఇక టికెట్ల విక్రయంతో హెచ్ సీఏకు సంబంధం ఏముంటుందని ప్రశ్నించారు. బ్లాక్ లో టికెట్లు విక్రయించారనేది అవాస్తవమన్నారు. దీనిపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. కాంప్లిమెంటరీ పాస్ లు భారీగానే ఇచ్చినట్లు అజార్ వెల్లడించారు. ఇక తొక్కిసలాట బాధాకరమన్న ఆయన.. గాయపడ్డ వారికి హెచ్ సీఏ ఖర్చులతోనే వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు.


More Telugu News