కుప్పంలో భరత్ ను గెలిపిస్తే మంత్రిగా చేస్తా: సభా వేదిక నుంచి సీఎం జగన్ ప్రకటన

  • కుప్పంలో సీఎం జగన్ సభ
  • చేయూత పథకం నిధుల విడుదల
  • కుప్పంపై చంద్రబాబుకు వెన్నుపోటు ప్రేమే ఉందన్న సీఎం 
  • బాబు హైదరాబాద్ కు లోకల్, కుప్పంకు నాన్ లోకల్ అని వ్యంగ్యం
ఏపీ సీఎం జగన్ ఇవాళ కుప్పంలో నిర్వహించిన సభలో చేయూత పథకం నిధులను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ విపక్ష నేత, మాజీ సీఎం, కుప్పం ఎమ్మెల్యే చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. కుప్పంకు చంద్రబాబు ఎమ్మెల్యేనే అయినా నాన్ లోకల్ గా మారిపోయారని, హైదరాబాద్ కు లోకల్ అయ్యారని ఎద్దేవా చేశారు. 

కుప్పం నుంచి తనకు కావాల్సినంత రాబట్టుకున్నాడని, ప్రజలకు మాత్రం ఏమీ చేయలేదని వ్యాఖ్యానించారు. దొంగ ఓట్లు వేయించుకోవడంలో బాబుకు ఉన్న అనుభవం గురించి ఈ జిల్లాలో కథలు కథలుగా చెప్పుకుంటుంటారని తెలిపారు. గత 30 ఏళ్లుగా వెన్నుపోటుకు, దొంగ ఓటుకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచింది ఎవరూ అంటే, అది చంద్రబాబేనని అన్నారు. కుప్పంపై కూడా చంద్రబాబుకు వెన్నుపోటు ప్రేమే ఉందని విమర్శించారు. 

కుప్పం నుంచి నిత్యం 5 వేల మంది ఇతర ప్రాంతాలకు వలస వెళుతున్నారని తెలిపారు. కుప్పం నుంచి పలమనేరు హైవేకి లింక్ ఇస్తానని చెప్పి, వదిలేశాడని, కుప్పం మున్సిపాలిటీ పరిధిలో డబుల్ రోడ్డు వేయలేదని ఆరోపించారు. ఎన్నిసార్లు గెలిచినా కుప్పంలో రోడ్డు వేసే మనసు లేదు కానీ, కుప్పంలో ఎయిర్ పోర్టు నిర్మిస్తానని ప్రజల చెవిలో పూలు పెట్టాడని అన్నారు. 

చివరికి రెవెన్యూ డివిజన్ కూడా ఏర్పాటు చేయలేకపోయాడని విమర్శించారు. ప్రజల నుంచి ఒత్తిడి వచ్చేసరికి నాకు లేఖ రాశాడు... చంద్రబాబు కంటే చేతకాని నాయకుడు ఉంటాడా? అని ప్రశ్నించారు. చంద్రబాబు కుప్పంను ఏనాడూ సొంత నియోజకవర్గం అని భావించలేదని, సీఎం అయ్యాక హైదరాబాద్ లో ఇంద్రభవనం లాంటి ఇల్లు కట్టుకున్నాడని అన్నారు. 

కుప్పం బీసీల సీటు అని, ఇక్కడ అత్యధికంగా ఉన్నది బీసీలేనని సీఎం జగన్ వెల్లడించారు. అలాంటప్పుడు బీసీలకు ఈ సీటును ఇవ్వకుండా లాక్కున్న పెద్దమనిషి సామాజిక న్యాయం గురించి మాట్లాడడం హాస్యాస్పదం అని వ్యాఖ్యానించారు. 36 ఏళ్లలో ఒక్కసారి కూడా ఈ సీటును టీడీపీ బీసీలకు ఇవ్వలేదని ఆరోపించారు. ఇది బాబు మార్కు సామాజిక న్యాయం అని విమర్శించారు. 

ఇక ఆయన చేసే మోసాలు భరించేది లేదని, ఇక తలవొగ్గేది లేదని కుప్పం ప్రజలు భావిస్తున్నారని తెలిపారు. ఎమ్మెల్సీగా ఉన్న భరత్ తనతో ఇన్ని అభివృద్ధి పనులు చేయిస్తున్నాడని, వచ్చే ఎన్నికల్లో కుప్పంలో భరత్ ను గెలిపిస్తే మంత్రిని చేస్తానని సీఎం జగన్ సభాముఖంగా ప్రకటించారు. కుప్పం నియోజకవర్గాన్ని సొంత నియోజకవర్గంగా భావిస్తానని స్పష్టం చేశారు.  

జిల్లా పరిషత్, మండల, పంచాయతీ ఎన్నికల అన్నింటిలోనూ కుప్పం ప్రజలు తమ పక్షానే నిలిచి వైఎస్సార్సీపీ క్లీన్ స్వీప్ జెండాను ఎగురవేశారని కొనియాడారు. కుప్పంలోని అక్కచెల్లెమ్మలు, అన్నదమ్ములకు ఇంకా మంచి చేసే అవకాశం రావాలని కోరుకుంటున్నానని తెలిపారు. కుప్పం ప్రజలకు మూడేళ్లలో పథకాలతో రూ.1,149 కోట్లు ఇచ్చామని వివరించారు. కుప్పం నియోజకవర్గంలో డీబీటీ ద్వారా రూ.866 కోట్లు, నాన్ డీబీటీ ద్వారా రూ.283 కోట్లు ఇచ్చామని వెల్లడించారు. 

"అభివృద్ధి పనులకు రూ.66 కోట్లు ఇచ్చింది మీ బిడ్డ జగనే. కలగా మిగిలిన ఆర్డీవో కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది, రామకుప్పంలో విద్యుత్ సబ్ స్టేషన్ ఏర్పాటు చేసింది కూడా మీ బిడ్డే. ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ పూర్తి చేసింది, ఒకేషనల్ జూనియర్ కాలేజీ పూర్తి చేసింది కూడా మన ప్రభుత్వమే. కుప్పంలో ద్రవిడ యూనివర్సిటీకి రూ.20 కోట్లు కేటాయించింది కూడా మీ బిడ్డే" అని వివరించారు. 

14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి కూడా చంద్రబాబు తన సొంత  నియోజకవర్గం కుప్పంలో కరవుకు పరిష్కారం చూపలేకపోయాడని విమర్శించారు. కేంద్రంలో రాష్ట్రపతులను మార్చుతానంటాడు, ప్రధానమంత్రులను కూడా తానే నియమిస్తానని, కేంద్రంలో తానే చక్రం తిప్పానని చెప్పుకుంటాడు, కానీ కుప్పంలో పంపులు తిప్పితే నీరు వచ్చే పరిస్థితిని తీసుకురాలేకపోయాడు ఈ పెద్ద మనిషి అని వ్యాఖ్యానించారు. కాంట్రాక్టులు ఇచ్చి కమీషన్లకు కక్కుర్తి పడ్డాడే తప్ప, కుప్పంకు నీళ్లు ఇచ్చేందుకు ఎక్కడా ప్రయత్నించలేదని అన్నారు.


More Telugu News