వైసీపీ నేతను లారీతో ఢీకొట్టి హత్య చేసిన దుండగులు.. సింగరాయకొండలో ఉద్రిక్తత

  • పాతకక్షలతోనే హత్య!
  • గోడ దూకి పోలీస్ స్టేషన్‌లో ఉన్న లారీకి నిప్పు
  • ఓ చలివేంద్రాన్నీ బుగ్గి చేసిన నిరసనకారులు
  • పట్టణంలోని దుకాణాలను మూసివేయించిన వైనం
  • ఒంగోలు నుంచి అదనపు బలగాలను రప్పించి మోహరింపు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత హత్యతో ప్రకాశం జిల్లా సింగరాయకొండలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇవి కాస్తా హింసాత్మకంగా మారే అవకాశం ఉండడంతో ఒంగోలు నుంచి అదనపు బలగాలను తెప్పించి సింగరాయకొండలో మోహరించారు. కాగా, పాతకక్షల నేపథ్యంలో వైసీపీ నేత పసుపులేటి రవితేజను దుండగులు నిన్న లారీతో ఢీకొట్టి హత్య చేశారు. విషయం తెలియడంతో సింగరాయకొండ ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారిపోయింది. నిందితులు హత్యకు ఉపయోగంచిన లారీని స్వాధీనం చేసుకున్న పోలీసులు దానిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. 

హత్యకు నిరసగా ఆందోళన చేస్తున్న వారిలో కొందరు పోలీస్ స్టేషన్ గోడలు దూకి లారీకి నిప్పంటించారు. దీంతో పరిస్థితులు ఒక్కసారిగా అదుపుతప్పాయి. లారీకి నిప్పు పెట్టిన ఆందోళనకారులు పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న చలివేంద్రాన్ని కూడా తగలబెట్టారు. పట్టణంలోని దుకాణాలను మూసివేయించారు. వారిని అదుపు చేసేందుకు ఉన్నతాధికారులు ఒంగోలు నుంచి అదనపు బలగాలను రప్పించి మోహరించారు. డీఎస్పీ, సీఐ, ఎస్సైలు బందోబస్తును పర్యవేక్షిస్తున్నారు. ఆందోళనలు హింసాత్మకంగా మారకుండా చర్యలు చేపట్టారు.


More Telugu News