ఐపీఎల్ నిర్వహణపై కీలక ప్రకటన చేసిన గంగూలీ

  • తిరిగి పాత పద్ధతిలో ఐపీఎల్ నిర్వహిస్తామన్న బీసీసీఐ అధ్యక్షుడు
  • 2023లో ఇంటా-బయట మ్యాచ్ లు ఉంటాయన్న గంగూలీ
  • మహిళల ఐపీఎల్ తొలి సీజన్ వచ్చే ఆరంభంలోనే ఉంటుందని వెల్లడి
ఐపీఎల్ విషయంలో బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కీలక ప్రకటన చేశారు. పురుషులతో పాటు మహిళల ఐపీఎల్ పై తాజా విషయాలను వెల్లడించారు. కరోనా కారణంగా గత రెండేళ్లుగా పరిమిత మైదానాల్లో నిర్వహిస్తున్న ఐపీఎల్ ను తిరిగి మునుపటి ఫార్మాట్ లో నిర్వహిస్తామని ప్రకటించారు. 2023 సీజన్ ఐపీఎల్ లో ఇదివరకటిలా ఇంటా, బయట మ్యాచ్ లు జరుగుతాయని చెప్పారు. ఇందుకు ఆయా రాష్ట్రాల క్రికెట్ సంఘాలు సంసిద్ధంగా ఉండాలని సూచించారు. కరోనా కారణంగా 2020 ఐపీఎల్ ను పూర్తిగా యూఏఈలో నిర్వహించారు. 

2021 సీజన్ ను సగం భారత్ లో, మిగతా సగాన్ని ఏడారి దేశంలో నిర్వహించారు. ఈ ఏడాది అభిమానుల సమక్షంలో ఢిల్లీ, ముంబై, అహ్మదాబాద్‌, చెన్నై వేదికల్లో మ్యాచ్‌లు జరిగాయి. అయితే వచ్చే ఏడాది నుంచి ఐపీఎల్‌ తమ పాత పద్ధతిలోకి మారనుంది. దీంతో ఎప్పటిలాగే సొంత మైదానం-బయటి మైదానం తరహాలో మ్యాచ్‌లు జరుగుతాయని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ ప్రకటించారు. ఇక, ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న మహిళల ఐపీఎల్ ను వచ్చే ఏడాది ప్రవేశ పెడతామని గంగూలీ వెల్లడించారు. 2023 ఆరంభంలోనే తొలి సీజన్ ను నిర్వహిస్తామని తెలిపారు.


More Telugu News